కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..

- December 15, 2025 , by Maagulf
కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కోఠి ఉమెన్స్‌ కాలేజీలో లైంగిక వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.వర్సిటీలో పీజీ చదువుతున్న విద్యార్థినులను గర్ల్స్‌ హాస్టల్‌ మెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

రక్షణగా నిలవాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో ఉండాలంటేనే భయం వేస్తోందని, నిత్యం వినోద్‌ వేధింపుల వల్ల తాము తీవ్ర మానసిక ఒత్తిడికి, ఇబ్బందులకు గురవుతున్నామని యువతులు వాపోతున్నారు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేరుగా కోఠి ఉమెన్స్ కాలేజీకి వెళ్లి అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. విద్యార్థినులకు ధైర్యం చెబుతూనే, ఆరోపణలు ఎదుర్కొంటున్న మెస్ ఇన్‌ఛార్జ్ వినోద్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాన్ని మరియు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునేంతవరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

మరోవైపు వినోద్ ఆగడాలపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి షీటీమ్స్‌కు (SHE Teams) ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కొన్ని ఆడియో మెసేజ్‌లను కూడా అధికారులకు పంపించారు. అయితే, ఈ విషయమై తాము ఇప్పటికే కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థినులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com