ఏపీలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త

- December 16, 2025 , by Maagulf
ఏపీలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లో ఈ విమానాశ్రయం విమాన రాకపోకలతో ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను 2026లో ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. తొలుత 2026 జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ, పనులు ఆశించిన దానికంటే వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో మే నెలలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుందని చెప్పారు.

విశాఖపట్నంలో జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, ఈ ఒప్పందం చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

పౌర విమానయాన రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. అలాగే ఏవియేషన్ రంగంలో నైపుణ్య శిక్షణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని, అనేక విద్యాసంస్థలు, యూనివర్సిటీల స్థాపనకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఏవియేషన్ రంగాలను సమన్వయంగా అభివృద్ధి చేస్తూ ఉత్తరాంధ్రను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం, ఏవియేషన్ ఎడ్యు సిటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని, వలసలను తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com