వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..

- December 16, 2025 , by Maagulf
వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..

 విశాఖపట్నం: మహిళల ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఆ ఘన విజయం తర్వాత తమ తొలి అంతర్జాతీయ సిరీస్‌కు సిద్ధమైంది.ఈ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదికగా నిలవనుంది.ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ భారత జట్టుకు స్వాగతం చెబుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు.

భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య ఈ నెల 21 నుంచి 30 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో డిసెంబర్ 21, 23 తేదీల్లో జరగనున్న తొలి రెండు మ్యాచ్‌లు విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖకు ఈ మ్యాచ్‌లు రావడంపై నారా లోకేశ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

భారత మహిళల జట్టు ప్రపంచకప్ ప్రయాణం విశాఖ నుంచే ప్రారంభమైందని ఆయన గుర్తుచేశారు. వరల్డ్ కప్‌కు ముందు నెల రోజుల పాటు ఇక్కడే శిక్షణ శిబిరం నిర్వహించారని, ఇప్పుడు విశ్వవిజేతలుగా నిలిచిన తర్వాత తొలి మ్యాచ్‌లను కూడా విశాఖలోనే ఆడడం గర్వకారణమని లోకేశ్ పేర్కొన్నారు.

“ఛాంపియన్లకు స్వాగతం భారత మహిళల జట్టు ప్రపంచకప్ దిశగా అడుగులు వేసింది మన విశాఖ నుంచే ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్లు గా తిరిగి వచ్చి ఇక్కడే మ్యాచ్‌లు ఆడటం ఆనందంగా ఉంది” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో ఈ మ్యాచ్‌ల పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com