తెన్నేటి సుధా రామ రాజు పేరిట లక్ష రూపాయల సాహితీ పురస్కారం ప్రకటింపు

- December 24, 2025 , by Maagulf
తెన్నేటి సుధా రామ రాజు పేరిట లక్ష రూపాయల సాహితీ పురస్కారం ప్రకటింపు

హైదరాబాద్: తెలుగు సాహిత్యానికి విశేష సేవలందిస్తున్న రచయిత్రులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తెన్నేటి సుధా రామ రాజు పేరిట లక్ష రూపాయల సాహితీ పురస్కారంను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణ ప్రకటించారు.కవిత, కథ, నవల, నాటకం వంటి తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ప్రతి ఏటా అంతర్జాతీయ స్థాయిలో రచయిత్రులను ఎంపిక చేసి, వంశీ ఇంటర్నేషనల్ నిర్వహణలో ఒక్కొక్కరికి రూ.25,000 నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రకటన శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికపై గానసభ నిర్వహించిన సుధా దేవి సంస్మరణ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ, సుధా దేవి ఉత్తమ ధర్మపత్ని, మాతృమూర్తిగా తన కర్తవ్యాన్ని ఆచరించి నిష్క్రమించారని నివాళులు అర్పించారు. సుధా దేవి జన్మదినమైన అక్టోబర్ 5న ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తామని వెల్లడించారు. సుధ రచయిత్రి కావడంతో ఈ అవార్డు నిర్ణయం సముచితమని, రామ రాజును అభినందించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి మాట్లాడుతూ, సుధా దేవి గొప్ప రచయిత్రి మాత్రమే కాకుండా ఉన్నత వ్యక్తిత్వం కలిగినవారని కొనియాడారు.

అవార్డు ఎంపిక కమిటీగా ఉపాధ్యక్షుడిగా బూరుగుపల్లి వ్యాస కృష్ణ (ఉగాండా), సభ్యులుగా డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు (అమెరికా), రత్న కుమార్ కవుటూరు (సింగపూర్) వ్యవహరిస్తారని తెలిపారు. కన్వీనర్‌గా వంశీ రామరాజు, సమన్వయకర్తలుగా రాధిక (ముంబయి) పనిచేస్తారని ప్రకటించారు.

ఈ సందర్భంగా సుధా రామ రాజు కుమారుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ, తన తల్లి సుధా దేవి తన మనవరాలు అనఘ నానమ్మ పై రాసిన కవితను వేదిక పై చదివి వినిపించారు. కార్యక్రమంలో బూరుగుపల్లి వ్యాస కృష్ణ, వంశీ ధర్ తరంగిణి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గానసభలోని ఉద్యోగులకు సుధా దేవి పేరిట నగదు పారితోషికాన్ని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com