ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు

- December 24, 2025 , by Maagulf
ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు

న్యూ ఢిల్లీ: ఆధార్ కార్డు భారతదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, సంక్షేమ పథకాలు, అలాగే అనేక ప్రైవేట్ సేవలకు ఆధార్ తప్పనిసరి అయింది. అందుకే ఆధార్‌కు సంబంధించిన చిన్న మార్పు జరిగినా దేశవ్యాప్తంగా కోట్లాది మందిపై ప్రభావం చూపిస్తుంది. 2025లో ఆధార్ వినియోగాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే లక్ష్యంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పలు కీలక మార్పులను అమల్లోకి తీసుకొచ్చింది.

ఆధార్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు UIDAI అప్డేట్ ఛార్జీలను సవరించింది. ఇప్పటివరకు బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవడానికి రూ.100గా ఉన్న ఫీజును 2025లో రూ.125కు పెంచారు. అలాగే పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాల మార్పులకు గతంలో రూ.50 వసూలు చేయగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.75కు పెంచారు. ఈ ఫీజు సవరణలు ఆధార్ సేవల నాణ్యతను మెరుగుపరచడానికే చేసినట్లు UIDAI తెలిపింది.

2025లో UIDAI ఆధార్ పేరుతో ఒక కొత్త, అత్యంత భద్రమైన డిజిటల్ యాప్‌ను విడుదల చేసింది. ఇకపై ఫిజికల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీల అవసరం లేకుండా ఈ యాప్ ద్వారానే డిజిటల్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీ ఆధార్ డిజిటల్ కాపీ అందుబాటులో ఉంటుంది. ఏ సేవ పొందాలన్నా ఫోన్‌లోనే ఆధార్ చూపించి తక్షణమే ధృవీకరణ పూర్తిచేయవచ్చు. దీంతో డాక్యుమెంట్ మిస్యూస్ అవకాశాలు కూడా తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఆధార్ సేవల్లో మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే—ఇంటి నుంచే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు.గతంలో మొబైల్ నెంబర్ మార్పు కోసం తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లి, క్యూలో గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చేది. కొత్త విధానంతో ఆ ఇబ్బందులన్నింటికీ చెక్ పడింది. ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలోనే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com