సినిమా రివ్యూ: ‘శంబాల’.!

- December 25, 2025 , by Maagulf
సినిమా రివ్యూ: ‘శంబాల’.!

సైన్స్‌కీ, దైవానికీ లింక్ అప్ చేసి థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కించే సినిమాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే వుంటాయ్. అయితే, ఎంత ఆసక్తికరంగా కథనాల్ని నడిపించారన్నదే ఆయా సినిమాలు సక్సెస్ అవ్వడమా.? లేదా.? అనే విషయం ఆధారపడి వుంటుంది. ‘శంబాల’ అనే పేరు ప్రబాస్ నటించిన ‘కల్కి’ సినిమా ద్వారా పరిచయమైంది. అదే ఇంట్రెస్టింగ్ పేరును టైటిల్‌గా పెట్టి ఓ ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కిన చిత్రమే ఈ ‘శంబాల’. ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తూ అనేక రకాల జోనర్స్ ట్రై చేసేసిన ఆది సాయికుమార్‌కి ఈ చిత్రం ఓ డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మరి, ఆదికి ఈ సారైనా ‘శంబాల’తో హిట్టు దశ పట్టిందా.? లేదా.? తెలియాలంటే ‘శంబాల’ కథలోకి వెళ్లాల్సిందే.

కథ:                                                                                                                                     1980 దశకం బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర వున్న ఓ చిన్న ఊరు శంబాల. ఆకాశం నుంచి ఓ ఉల్క జారి ఆ ఊరిపై పడుతుంది. అప్పటి నుంచీ అంతా బాగానే వున్న ఆ ఊరిలో అనుకోని సంఘటనలు తలెత్తుతుంటాయ్. మెడ వెనక ఓ బొడిపె లాంటి రోగం వచ్చి ఆ వ్యక్తులు భీకరంగా భయానకంగా జాంబీల్లా మారి దారుణంగా హత్యలు చేస్తుంటారు. అలాగే ఆత్మ హత్యలు చేసుకుని చనిపోతుంటారు. దాంతో ఆ ఊరిలో భయం ఆవహిస్తుంది. ఇదంతా దుష్ట శక్తి ప్రభావమే దయ్యం పట్టిందనీ, భూతం ఆవహించిందనీ.. ఆ ఊరిలో మూఢ నమ్మకాలు తాండవం చేస్తుంటాయ్. అసలింతకీ ఆ ఊరికి వచ్చిన ఈ వింత సమస్య ఏంటీ.? అక్కడి జనాలు అలా విచిత్రంగా ప్రవర్తించడానికి కారణాలేంటీ.? సైన్స్ కారణమా.? లేక దుష్ట శక్తి ప్రభావమా.? ఈ రహస్యాల్ని చేధించేందుకు విక్రమ్ (ఆది సాయి కుమార్) అనే యువ సైంటిస్ట్‌ని ఆ ఊరికి పంపిస్తుంది ప్రభుత్వం. సైన్స్‌ని బలంగా నమ్మడంతో పాటూ స్వతహాగా నాస్తికుడైన విక్రమ్ ఆ ఊరిలోని వింత రహస్యాల్ని ఛేధించాడా.?  దేవి (అర్చన అయ్యర్) ఎవరు.? ఎందుకు విక్రమ్‌కి మాత్రమే దేవి కనిపిస్తుంది.? సైన్స్‌కీ, ఆ ఊరి చరిత్ర వెనక వున్న శాస్త్రానికీ మధ్య వున్న సంబంధం ఏంటీ.? తెలియాలంటే ‘శంబాల’ మూవీ అనుభూతిని ధియేటర్లలో పొందాల్సిందే.!

నటీనటుల పనితీరు:
లవర్ బాయ్‌లా, యాక్షన్ హీరోలా.. ఫ్యామిలీ హీరోగా.. ఇలా చాలా రకాల పాత్రల్లో మెప్పించిన ఆది సాయి కుమార్‌కి ఈ సినిమాలో పాత్ర ఏమంత కొత్తదేం కాదు. కానీ, జోనర్ మాత్రం కొత్తదే అని చెప్పొచ్చు. సైంటిస్ట్ విక్రమ్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు ఆది సాయి కుమార్. దేవి పాత్రలో అర్చన అయ్యర్ తన పాత్రకున్న పరిధిలో బాగా నటించింది.  అనుమానం కలిగేలా చిత్రీకరించిన రవివర్మ, మీసాల లక్ష్మణ్ తదితరుల పాత్రలు కీలకంగా ప్రభావితం చేస్తాయ్. అలాగే మిగిలిన పాత్రలు కూడా సినిమా చివరి వరకూ ఏదో ఒక రకంగా కథపై కీలకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయ్. చివరి వరకూ సస్పెన్స్ క్రియేట్ అయ్యేలా ఆయా పాత్రల చిత్రీకరణ వుంటుంది. దాంతో, అన్ని పాత్రలూ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా వుంటాయ్.

సాంకేతిక విభాగం పనితీరు:
భయపెట్టే అంశాలూ, మిస్టరీ, థ్రిల్లర్, హారర్, ఉత్కంఠ, ఆత్మలు, దేవుళ్లు.. సైన్స్, శాస్ర్రం.. ఇలా అన్ని రకాల అంశాల్నీ ఈ సినిమాలో జోడించారు. ఓ హారర్ థ్రిల్లర్ సినిమాకి వుండాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో వున్నాయ్. వాటిని కథానుగుణంగా మలచిన తీరు కూడా బాగుంది. 1980 దశకం బ్యాక్ డ్రాప్‌ నేపథ్యాన్ని తీర్చి దిద్దిన వైనం బాగుంది. సినిమాటోగ్రఫీ నిజంగా మెయిన్ అస్సెట్ ఈ సినిమాకి. కథ మొదైలన కాసేపటికే ఆ శంబాల ప్రపంచంలోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. అక్కడి భయానక పరిస్థితులు, భూతం ఆవహించడం.. లాంటి హారర్ అంశాలు నిజంగానే థ్రిల్‌తో పాటూ భయాన్నీ కలిగిస్తాయ్. ఇంటర్వెల్‌కి కొన్ని నిమిషాల ముందు నుంచీ సినిమాపై మరింత ఉత్కంఠ మొదలవుతుంది. అది సెకండాఫ్‌పై ఆసక్తి కలిగించేలా వుంటుంది. చెరకు తోటలోని హారర్ సన్నివేశాలు కొంత ప్రత్యేకంగా వుంటాయ్.  ద్వితీయార్ధంలో భూతం కొందరు వ్యక్తుల్ని ఆవహించడం.. ఆ టైమ్‌లో హీరో వారితో ప్రతిఘటించడం ఆ సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. పతాక సన్నివేశాల్లో చిన్న పాపతో లింక్ పెట్టడం ఒకింత భావోద్వేగాలను తావిస్తుంది. దాంతో బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్.. చివరి వరకూ కథలోని సస్పెన్స్ అలాగే కొనసాగించడం ఒకింత సాహసంతో కూడిన పనే. కానీ, కొన్ని సందర్భాల్లో అదే లాగ్ అయిపోయిందన్న ఫీల్ కలుగుతుంది. ఏది ఏమైనా ‘శంబాల’.. థ్రిల్లర్ స్టోరీకి సాంకేతిక విభాగం అందించిన సపోర్ట్‌తో ఆ థ్రిల్ మరింత రెట్టింపయ్యిందనే చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్:
సర్‌ప్రైజింగ్ అనిపించేలా చిత్రీకరించిన కొన్ని పాత్రల చిత్రీకరణ, ఇంటర్వెల్‌కి ముందొచ్చే ఎపిసోడ్, ద్వితీయార్ధం‌లోని హారర్ అండ్ థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ అంశాలు, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్..

మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కథానాయకుడి కళ్ల ముందే జరుగుతున్నప్పటికీ ఎలాంటి ప్రతిఘటనా చేయలేకపోవడం..అలాగే కొన్ని రొటీన్ హారర్ థ్రిల్లర్ సినిమాల్లోని సన్నివేశాలనే గుర్తుకొచ్చేలా చేసిన సన్నివేశాలతో అక్కడక్కడా సాగతీతలా తోస్తుంది.

చివరిగా:
ఈ మధ్య వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే కాస్త బెటర్. ఈ జోనర్ ఆసక్తి వున్నవారికి ధియేటర్ థ్రిల్ పక్కా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com