సినిమా రివ్యూ: ‘ఛాంపియన్’.!
- December 25, 2025
శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘పెళ్లి సందడి’ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన చిత్రమే ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకి దర్శకుడు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల నిర్మాతలు ప్రియాంక దత్ అండ్ కో ఈ సినిమాని నిర్మించారు. ప్రమోషన్లు బాగా చేశారు. ప్రచార చిత్రాలు సైతం అంచనాలు పెంచేలా ఆకట్టుకున్నాయ్. మరి, అంచనాల్ని ‘ఛాంపియన్’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైద్రాబాద్ సంస్థానానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. అప్పటి నిజాం పాలనలో హైద్రాబాద్ సామాన్య ప్రజలు మగ్గిపోతున్న రోజులవి. తెలంగాణాలోని కొన్ని పల్లెలు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు బలయిపోతుంటారు. అయితే, ఉద్యమాల ఊపిరి గడ్డ అయిన బైరాంపల్లి గ్రామంలో మాత్రం రజాకార్లకు వ్యతిరేకంగా అక్కడి జనం పోరాటం చేస్తుంటారు. వీరోచితంగా పోరాడుతూ అక్కడి జనాల్లో స్వాతంత్ర్య కాంక్షను నింపుతుంటారు. మరోవైపు సికింద్రాబాద్‌కి చెందిన ఆంగ్లో ఇండియన్ కుర్రాడు మైఖేల్ (రోషన్). చిన్నతనం నుంచీ ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఆ ఆటలో ఛాంపియన్ కావాలని కలలు కంటుంటాడు. ఎట్టకేలకు తన ప్రతిభతో ఇంగ్లాండ్ మాంచెస్టర్ ఫుట్ బాల్ క్లబ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంటాడు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ దేశం వెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది మైఖేల్‌కి. అందుకోసం మైఖేల్ ఓ అక్రమ మార్గాన్ని ఎంచుకుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అనుకోకుండా 15 రోజుల పాటు బైరాన్ పల్లిలో వుండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అక్కడి జనాల ఉద్యమ నేపథ్యం వైపు మైఖేల్ ఎట్రాక్ట్ అవుతాడు. అక్కడే వున్న చంద్రకళ (అనస్వర రాజన్) గా పిలవబడే అమ్మాయి అల్లరి చేష్టలు మైఖేల్‌ను ఆమెతో ప్రేమలో పడేలా చేస్తాయ్. పెద్ద ఫుట్‌బాల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న మైఖేల్ ఎందుకు ఉద్యమ కారుడిగా మారాడు.? బైరాన్‌పల్లి గ్రామానికి అండగా నిలిచాడు.? తనను ఇంగ్లాండ్‌కి వెళ్లనీయకుండా అడ్డుకున్న అతని తండ్రి నేపథ్యం ఏంటీ.? ఇవన్నీ తెలియాలంటే ‘ఛాంపియన్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
ఆంగ్లో ఇండియన్ కుర్రాడు మైఖేల్ పాత్రలో రోషన్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. యాక్షన్ ఘట్టాల్లో, డాన్సుల్లో తన టాలెంట్ చూపించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాల్లో ప్రాణం పెట్టేశాడు. ఆడియన్స్ హృదయాల్ని కదిలించాడు. హీరోయిన్ అనస్వర బైరాన్ పల్లి గ్రామంలోని చంద్రకళగా పిలవబడే ఓ చిలిపి అల్లరి పిల్ల పాత్రలో చాలా బాగా నటించింది. నేచురల్ పర్‌ఫామెన్స్‌తో కట్టి పడేసింది. బైరాన్ పల్లి ఊరి పెద్దగా సీనియర్ నటుడు కళ్యాణ్ చక్రవర్తి పాత్ర సినిమాకి నిండుతనం అని చెప్పొచ్చు. జనంలో స్వాతంత్ర్య కాంక్షను పురిగొల్పేలా ఆయన చెప్పిన ఉపన్యాసాలు.. ఊరి జనానికి అండగా పెద్ద దిక్కుగా నిలబడిన వ్యక్తిగా ఆయన పాత్ర చిత్రీకరణ చాలా బాగుంది. అలాగే, మురళీ శర్మ, అర్చన, సంతోష్ ప్రతాప్, హైపర్ ఆది, రచ్చ రవి తదితరులు.. ఇలా ప్రతీ పాత్ర ఈ సినిమాలో కీలకమే. ఆయా పాత్రల్ని డిజైన్ చేసిన విధానం.. ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా వుంటుంది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఎంచుకున్న ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ నిజానికి పాతదే. కానీ, కథనం నడిపించిన తీరుతో మార్కులు కొట్టేశాడు. తెలిసిన కథనే ఓ క్రీడాకారుడి యాంగిల్ నుంచి ఎత్తుకుని కథనం నడిపించిన తీరు మెచ్చుకోదగ్గది. రజాకార్లు బైరాన్ పల్లిపై చేసిన దమన కాండను చాలా సహజ సిద్ధంగా కళ్లకు కట్టినట్టు చూపించాడు. డైలాగులు, యుద్ధ సన్నివేశాల నేపథ్యం విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అప్పటి చారిత్రక నేపథ్యానికి, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లింక్ అప్ చేసిన విధానం కూడా శభష్ అనిపిస్తుంది. మిక్కీ జె మేయర్ పాటలు సినిమాకి తగ్గట్లుగా వున్నాయ్. యుద్ద సన్నివేశాల్లో అప్పటి నేపథ్యాన్ని మ్యాచ్ చేసేలా బీజీఎమ్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా చక్కగా కుదిరింది. నేచురల్‌గా అనిపిస్తాయ్ విజువల్స్ అన్నీ. ఎడిటింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుని వుంటే బాగుండేది కానీ, సినిమాకి అవసరమున్నంత వరకూ చేయాల్సిందంతా చేసినట్లే ఆ కష్టం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎడిటింగ్ విషయంలో. ఇక, నిర్మాణ విలువలు టాప్ రేంజ్ అని చెప్పొచ్చు. సినిమాని నెక్స్‌ట్ లెవల్‌లో నిలబెట్టాయ్. ఓవరాల్‌గా అన్నీ బాగా కుదిరాయ్ ‘ఛాంపియన్’కి.
ప్లస్ పాయింట్స్:
శభాష్ అనిపించే స్క్రీన్‌ప్లే, ఆనాటి చారిత్ర నేపథ్యం, వార్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు.. హీరో పాత్రతో పాటూ, మిగిలిన అన్ని పాత్రల చిత్రీకరణ, దాదాపు 20 నిమిషాల పాటు ఆసక్తికరంగా ఉద్వేకంగా సాగిన పతాక సన్నివేశాలు మొదలైనవి.
మైనస్ పాయింట్స్:
చాలా తక్కువే..అక్కడక్కడా కా..స్త.. స్లోగా అనిపించిన సన్నివేశాలంతే.!
చివరిగా:
ఇయర్ ఎండింగ్.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నా..బుల్లెట్ దిగిందా లేదా.? రోషన్
‘ఛాంపియన్’. అంతే.!
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







