తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు

- December 27, 2025 , by Maagulf
తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దే దిశగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కీలక అడుగు వేసింది. (TG) మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కామన్ మొబిలిటీ కార్డు (CMC) అనే కొత్త స్మార్ట్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఉచిత బస్సు ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా అమలు చేస్తున్న సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు రూపకల్పన, సాంకేతిక అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)తో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ఇప్పటివరకు మహిళలు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. ఇందుకు గాను ప్రభుత్వం ఆర్టీసీకి దాదాపు రూ. 8,500 కోట్లను చెల్లించింది. బస్సుల్లో ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించాల్సిన నిబంధన వల్ల కండక్టర్లు, ప్రయాణికుల మధ్య తరచూ అపార్థాలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆధార్ కార్డులోని ఫొటో స్పష్టంగా లేకపోవడం, నకిలీ కార్డుల వినియోగం వంటి అంశాలు సమస్యగా మారాయి. ఈ ఇబ్బందులన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకురానుంది.

కామన్ మొబిలిటీ కార్డు కేవలం ఉచిత బస్సు ప్రయాణానికే పరిమితం కాకుండా, బహుళ ప్రయోజనాలు కలిగి ఉండనుంది. (TG) బస్సుల్లో ఈ కార్డును ట్యాప్ చేసి సులభంగా ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఈ కార్డులో డబ్బు లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి ఇతర ప్రజా రవాణా సేవలను వినియోగించుకునే వీలు ఉంటుంది. దీంతో ప్రతి సారి ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుంది. ఈ కార్డుల ద్వారా ప్రభుత్వానికి ప్రయాణికుల సమాచారం లభిస్తుంది. ఏ మార్గాల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో గుర్తించి, అవసరానికి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆర్టీసీ నష్టాలు తగ్గడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయి. భవిష్యత్తులో రేషన్, ఆరోగ్య సేవలు ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఇదే కార్డుతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత మహిళలతో ఈ విధానాన్ని ప్రారంభించి, దశలవారీగా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కామన్ మొబిలిటీ కార్డును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com