తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్

- December 28, 2025 , by Maagulf
తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఇప్పటికే రాజకీయ మార్పు మొదలైందని, అధికార పార్టీ వైఫల్యాల పై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కేటీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా రైతాంగ సమస్యలను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా 11 సార్లు దాదాపు 72 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, గత రెండేళ్లలో రెండుసార్లు రైతుబంధు నిధులను ఎగ్గొట్టి రైతులను వంచించిందని దుయ్యబట్టారు. దేవుళ్లపై, నాయకులపై ఒట్లు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు పాలన చేతగాక రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ప్రభుత్వం వణికిపోతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాషా శైలిని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ వంటి నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సంస్కారం కాదని హితవు పలికారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు గిరిజన భాషల్లోనూ బదులిచ్చే శక్తి ఉందని, కేవలం ముఖ్యమంత్రి పదవికి ఇచ్చే గౌరవంతోనే ఓపిక పడుతున్నామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై తాము సంస్కారంతోనే మాట్లాడటం లేదని, కానీ భీమవరం నుంచి అల్లుడిని తెచ్చుకున్నప్పుడు రేవంత్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రశ్నించారు. పాలనను గాలికొదిలేసి ఫోన్ ట్యాపింగ్, స్కామ్‌లు, ఫార్ములా-ఈ వంటి కేసుల డ్రామాలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ, గెలిచిన ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కడియం శ్రీహరి వంటి నాయకులు పార్టీ వీడినా, సామాన్య కార్యకర్తలు పోరాడి గెలిచారని కొనియాడారు. సర్పంచులకు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉంటాయని, గ్రామానికి సర్పంచే ముఖ్యమంత్రి అని పేర్కొంటూ.. కేంద్ర నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. సర్పంచులపై కాంగ్రెస్ వేధింపులు పెరిగితే వారిని కాపాడటానికి ప్రతి జిల్లాలో ‘లీగల్ సెల్’ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహంతో పనిచేసి తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా కదలాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరియు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్, హరిప్రియ నాయక్, బండి దీపక్ వంటి ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com