ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- December 31, 2025
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్పర్సన్ బేగం ఖలీదా జియా అంత్యక్రియలు బుధవారం ఢాకాలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు, ప్రజలు తరలిరావడంతో మానిక్ మియా అవెన్యూ జనసంద్రంగా మారింది. ఈ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం సమీపంలో ఉన్న మానిక్ మియా అవెన్యూలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్-ఎ-జనజా) నిర్వహించారు. అనంతరం, ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే షేర్-ఎ-బంగ్లా నగర్‌లోని చంద్రినా ఉద్యాన్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల ప్రతినిధులు హాజరయ్యారు.
అంతకుముందు, ప్రత్యేక విమానంలో ఢాకా చేరుకున్న జైశంకర్… ఖలీదా జియా కుమారుడు, బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్‌ను కలుసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత సంతాప సందేశాన్ని ఆయనకు అందజేశారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు జైశంకర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మంగళవారమే ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీదా జియా (80) మంగళవారం ఉదయం ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఖలీదా జియా మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. బుధవారం దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటించారు.
తాజా వార్తలు
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!







