ఉపకులపతుల నియామకం రద్దు..

- July 27, 2016 , by Maagulf
ఉపకులపతుల నియామకం రద్దు..

తెలంగాణలో వీసీల నియామకం రద్దు చేస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి.భోసలే, జస్టిస్‌ ఎ.వి.శేషసాయిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉప కులపతుల నియామకానికి సంబంధించిన అర్హతలు, నియమ నిబంధనలను ఉద్దేశిస్తూ జారీ చేసిన జీవో నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు తీర్పును నాలుగు వారాలపాటు న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. రెండు రోజుల క్రితం 8 వర్సిటీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీసీలను నియమించిన విషయం తెలిసిందే.
విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవులను రెండేళ్లుగా భర్తీ చేయకుండా ఆగినవారు మరో రెండు రోజులు ఆగలేకపోయారా..? అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని గత సోమవారం విచారణ సందర్భంగా ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఛాన్స్‌లర్లు, వీసీల నియామకాలకు సంబంధించిన చట్టాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తుండగా... నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. విచారణ పూర్తయ్యే దాకా నియామకాలు జరపబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హామీ ఇచ్చారని.. దాన్ని పక్కనబెట్టి ఎందుకు నియామకాలు చేపట్టారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఎంపీ, ఎమ్మెల్యే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికీ ఛాన్సలర్లుగా అవకాశం కల్పించేలా ప్రస్తుత జీవో ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com