సినిమా రివ్యూ: ‘ది రాజా సాబ్’.!
- January 09, 2026
ప్రబాస్ అంటే బాహుబలి.. బాహుబలి అంటే ప్రబాస్ అన్నట్లుగా మారిపోయింది. బాహుబలితో ప్రబాస్ తెచ్చుకున్న స్టార్‌డమ్ పుణ్యమా అని.. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా అదే స్థాయిని ఆశిస్తున్నారు ఆడియన్స్. అలా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ.. బాక్సాఫీస్ వద్ద సర్వైవ్ కావడం చాలా కష్టమైపోయింది ప్రబాస్‌కి. ఇక ఇదంతా కాదు.. కాస్త కొత్తగా ట్రై చేయాలనుకున్నాడో ఏమో.. మారుతితో సినిమాకి ఓకే చెప్పేశాడు. కాన్సెప్ట్ పరంగా ‘హారర్ కామెడీ’ అంటూ ఈ సినిమాని ప్రచారం చేసుకొచ్చారు. సరే, ఆ తరహా సినిమాలు ఈ పాటికే చాలా చాలా చూసేశాం. అయితే, మరి, ఇక్కడున్నది ప్రబాస్ కదా.! వాటన్నింటి కంటే భిన్నంగా ఈ సినిమాలో ఏముంది.? ఏదో వుండే వుంటుంది.. అంటూ అంచనాలతో ఈ సినిమాని చూసేద్దాం అనుకున్నారు.. ప్రీమియర్స్ వదలడమే చాలా చాలా కష్టమైపోయింది. ఎలాగో ప్రీమియర్స్ బయటికొచ్చాయ్. మిక్స్‌డ్ టాక్ వినిపించింది. మరి ఆ టాక్ ఏంటీ.? అసలు ‘ది రాజా సాబ్’ కొత్త ట్రయిల్ వర్కవుట్ అయ్యిందా.? లేదా.? తెలియాలంటే ‘ది రాజా సాబ్’ కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
నాన్నమ్మ, మనవడి కధ ‘ది రాజా సాబ్’. గంగాదేవి (జరీనావాహెబ్) ఓ పల్లెటూరులో చాలా చాలా సాదా సీదాగా బతుకుతున్న వృద్దురాలు. ఈమెకి రాజు (ప్రబాస్) అనే మనవడున్నాడు. రాజుకి నానమ్మ అంటే పంచ ప్రాణాలు. వయసు రీత్యా కొంచెం మతిమరుపుతో బాధపడుతుంటుంది గంగాదేవి. తనకు సంబంధించిన చాలా విషయాలు మర్చిపోయినప్పటికీ తనను అన్యాయంగా వదిలి వెళ్లిపోయిన తన భర్త కనకరాజు (సంజయ్ దత్) జ్ఞాపకాల్ని మాత్రం మర్చిపోదు. తన భర్తను ఎలాగైనా వెతికి తీసుకురమ్మని మనవడిని అడుగుతుంది. నానమ్మ కోరిక ఎలాగైనా తీర్చాలనుకుంటాడు రాజు. ఆ క్రమంలోనే చాలా కష్టపడి తాత ఆచూకీ కోసం బయలుదేరతాడు. కట్ చేస్తే.. నర్సాపూర్ అడవిలోని ఓ రాజ మహల్‌లో రాజు అతని నానమ్మ అనూహ్యంగా ఇరుక్కుంటారు. అసలు ఈ రాజమహల్ కథేంటీ.? అక్కడ ఎలాంటి పరిస్థితులు రాజు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాజు జీవితంలోకి వచ్చిన ముగ్గురమ్మాయిలు బైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ది కుమార్) ఎవరు.? మార్మిక విద్యలతో ఆ మహల్‌లో జరిగే అనూహ్య సంఘటనలకీ, కనకరాజుకీ ఏంటి సంబంధం.? ఈ అనూహ్య సంఘటనల నుంచి రాజు ఎలా బయట పడ్డాడు.? తనతో పాటూ, తన నానమ్మని ఎలా కాపాడుకున్నాడు.? ఈ విషయాలన్నీ తెలియాలంటూ ‘ది రాజా సాబ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీనటుల పని తీరు:
చాలా కాలం తర్వాత ప్రబాస్‌ని వింటేజ్ లుక్స్‌లో చూశాం ఈ సినిమాలో. తనదైన హ్యూమరస్‌తో ప్రబాస్ ఆకట్టుకున్నాడు. యాక్షన్, కామెడీ సీన్లలో తన స్టైల్ ఆఫ్ పాత ప్రబాస్‌ని బయటికి తీసుకొచ్చాడు. అక్కడి వరకూ ప్రబాస్ ఆడియన్స్‌కి హ్యాపీనే. సీనియర్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. కనకరాజు అనే ప్రేతాత్మ పాత్రలో తనదైన ఈజ్ చూపించేశాడు. మరో కీలకమైన పాత్ర ఈ సినిమాలో జరీనా వాహెబ్. ఆమె పాత్ర దాదాపు హీరోతో సమానంగా ట్రావెల్ అవుతుంది. ఆ పాత్రలో ఆమె హండ్రెడ్ పర్సంట్ బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇచ్చింది. హీరోయిన్లు ముగ్గురూ గ్లామర్‌కి కేరాఫ్ అడ్రస్ అంతే. అన్‌నెసెసరీ గ్లామర్‌ని అడ్డదిడ్డంగా ఆరబోసేశారంతే. లాజిక్కుల్లేకుండా కాస్టూమ్స్ వేశారు. వున్నదాంట్లో మాళవిక పాత్రకు కొంచెం స్క్రీన్ స్పేస్ దక్కిందంతే. సముద్ర ఖనిని సరిగ్గా వాడలేదనిపిస్తుంది. సైకియాట్రిస్ట్ పాత్రలో బొమన్ ఇరానీ పాత్ర కాస్త కీలకం. మిగిలిన పాత్రధారులు సత్య, వీటీవీ గణేష్, సప్తగిరి తదితరులున్నప్పటికీ వారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేంత కామెడీని ఊహించలేము.
సాంకేతిక వర్గం పని తీరు:
ప్రచార చిత్రాల్లో చూపించిన సన్నివేశాలేమీ సినిమాలో లేవు. ప్రోమోస్‌లో రిలీజ్ చేసిన గ్రాఫిక్స్ విషయంలో కాస్త రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయినా కానీ, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు పడినట్లు లేదు. బడ్జెట్ గట్టిగానే ఖర్చయినప్పటికీ ఆ వేల్యూ స్క్రీన్‌పై ఎక్కడా కనిపించదు. అవుట్ పుట్ అంత వీక్ అనే చెప్పాలి. ఇలాంటి సినిమాలకు ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అస్సెట్ కావాలి. కానీ, ఎందుకో తమన్ కూడా లైట్ తీసుకున్నాడనిపిస్తుంది. చాలా వరస్ట్ బీజీఎమ్ ఇచ్చాడన్న అభిప్రాయాలొస్తున్నాయ్. పాటలు కూడా సో సోగానే అనిపిస్తాయ్. సినిమాటోగ్రఫీ విషయంలోనూ చాలానే కంప్లయింట్స్ వున్నాయ్. ముఖ్యంగా ప్రబాస్ లుక్స్ విషయంలోనే ఒక్కో చోట ఒక్కో రకంగా కనిపించాడన్న వాదనలున్నాయ్. అలాగే విజువల్స్ విషయంలోనూ క్వాలిటీ కనిపించదు. 3 గంటల 9 నిమిషాల నిడివి వున్న ఈ సినిమాకి దాదాపు అరగంట వరకూ కత్తెర పడొచ్చన్న కంప్లైయింట్స్ ఎడిటింగ్ డిపార్టుమెంట్‌పై వున్నాయ్. నిర్మాణ విలువలు అంతంత మాత్రమే. ఈ సినిమాకి కథ కాస్త కొత్తగానే అనిపించింది. నిజానికి కథనాన్ని చక్కగా ప్రెజెంట్ చేసి వుంటే ఇదో డిఫరెంట్ హారర్ కామెడీ ఫాంటసీ మూవీనే అయ్యుండేది. అయితే ప్రబాస్ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు నచ్చినప్పుడు నచ్చినట్లుగా తిప్పేసి కలగాపులగం.. అమోమయం.. గందరగోళం.. చేసేశాడు దర్శకుడు మారుతి. ప్రబాస్ వంటి కటౌట్ తనని నమ్మి సినిమాని అప్పచెప్పినప్పుడు ఎంత జాగ్రత్తగా కథనాన్ని డిజైన్ చేసుకుని వుండి వుండాలి. కానీ, ఆ కేరింగ్ మారుతి టేకింగ్‌లో ఎక్కడా కనిపించదు. చాలా రొటీన్‌గా గత చిత్రాల్లో ఈ సన్నివేశాలు చూసేశాం కదా.. అనిపించేలానే వుంటాయ్. వాడకం చూస్తే.. ఏకంగా సైకియాట్రిజం.. హిప్నాటిజం.. మాయలు, మంత్రాలు, మర్మ కళలు.. ఇలా అడ్డదిడ్డంగా వాడి పడేశాడు. అవేమీ పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. ఓవరాల్‌గా తనకొచ్చిన బాహుబలి అవకాశాన్ని మారుతి సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథలోని కొత్తదనం, ప్రబాస్ లుక్స్..
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం వున్నప్పటికీ వీక్ అండ్ పరమ రొటీన్ కథనం, నాసిరకం విజువల్ ఎఫెక్ట్స్.. క్వాలిటీ లేని సినిమాటోగ్రఫీ.. వీక్ క్లైమాక్స్ మొదలైనవి..
చివరిగా:
‘రాజా సాబ్’కి ప్రబాస్ ఫ్యాన్సే రాజ పోషకులు.. పండగ వేళ రాజాసాబ్‌ని ఎలా పోషిస్తారో చూడాలి మరి.!
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







