పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు

- January 10, 2026 , by Maagulf
పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు

విజయవాడ: పీబీ సిద్ధార్ధ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సిద్ధార్ధ అకాడమీని రాష్ట్రంలోనే అత్యుత్తమ విద్యా సంస్థలలో ఒకటిగా ప్రశంసించారు.

లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత సిద్ధార్ధ అకాడమీకి దక్కిందని, విజయవాడను “విద్యల వాడ”గా మార్చడంలో ఈ సంస్థ చేసిన కృషి అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీతో పాటు గోల్డెన్ జూబ్లీ వేడుకలకు కూడా తాను హాజరుకావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఎడ్, హోటల్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ తదితర విభాగాల్లో 18 కళాశాలల ద్వారా 28 వేల మంది విద్యార్థులను సిద్ధార్ధ అకాడమీ తీర్చిదిద్దుతోందని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును మలుస్తున్న ఈ సంస్థకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అగ్రిటెక్ కళాశాల ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ఎలాంటి ప్రయోజనం లేదా పరిహారం కోరుకోకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భవనాలు అందించినందుకు సిద్ధార్ధ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధార్ధ విద్యాసంస్థలు నిర్మించిన కళాశాల భవనాలను యూనివర్సిటీగా అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్‌దని గుర్తు చేశారు.

విద్యార్థులు–తల్లిదండ్రులు–ఉపాధ్యాయులతో ఏడాదికి రెండు సార్లు మెగా పేరెంట్–టీచర్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకువచ్చి మన దగ్గరే నైపుణ్యాలను పెంచుతున్నామని, ప్రైవేట్ రంగంలోని ప్రముఖ యూనివర్సిటీలు కూడా అమరావతిలో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను అమరావతిలో ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు.15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతుందని, కేంద్రం క్వాంటం మిషన్ ప్రకటించగానే అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఆరు నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పని ప్రారంభిస్తుందని, క్వాంటం అల్గారిథమ్స్ నేర్పేందుకు కోర్సులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రపంచం మెచ్చే అమరావతి రాజధానిని నిర్మించబోతున్నామని, ఈ వేగాన్ని చూసి కొందరు ఆసూయతో అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు వికసించాయని, అమరావతి పవిత్ర ప్రజా రాజధానిగా అన్‌స్టాపబుల్‌గా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. విజయవాడ–గుంటూరు–మంగళగిరి–అమరావతి కలిసి ఒక బెస్ట్ లివబుల్ సిటిగా రూపుదిద్దుకుంటాయని అన్నారు.

వికసిత్ భారత్–2047 లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధనకు కట్టుబడి ఉన్నామని, ఐటీ తర్వాత ఇప్పుడు ఏఐ, క్వాంటం టెక్నాలజీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో క్వాంటం కంప్యూటర్ల తయారీ దిశగా అడుగులు వేస్తామని, తిరుపతిలో స్పేస్ సిటీ కోసం రెండు శాటిలైట్ కంపెనీలు ముందుకు వచ్చాయని, కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మెడికల్ ఎక్విప్‌మెంట్, డిఫెన్స్, సెమీకండక్టర్ పరిశ్రమలు ఏపీలోకి రానున్నాయని తెలిపారు.

టెక్నాలజీ ద్వారా పాలన, పౌర సేవలను మరింత సమర్థంగా అందిస్తున్నామని, సంజీవని కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com