త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం

- January 19, 2026 , by Maagulf
త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం

వాట్సాప్ వినియోగదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ వీడియో(Group Video Call) మరియు ఆడియో కాల్స్ సౌకర్యం త్వరలో వాట్సాప్ వెబ్‌లో అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ లేదా విండోస్ డెస్క్‌టాప్ యాప్ అవసరం ఉండేది. అయితే తాజా అప్‌డేట్‌తో, ఇకపై కేవలం వెబ్ బ్రౌజర్ ద్వారానే కాల్స్ చేయగలిగే అవకాశం వినియోగదారులకు లభించనుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, క్రోమ్, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ వంటి ప్రధాన బ్రౌజర్‌లలోనే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. దీంతో ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ మీటింగ్స్, వర్చువల్ ఫ్యామిలీ కాల్స్ మరింత సులభంగా మారనున్నాయి.

ఇప్పటివరకు వాట్సాప్ వెబ్‌ను ప్రధానంగా మెసేజింగ్, ఫైల్ షేరింగ్, ఫోటోలు, డాక్యుమెంట్లు (Documents) పంపేందుకు మాత్రమే వినియోగించేవారు. కొత్త కాలింగ్ ఫీచర్‌తో వాట్సాప్ వెబ్ వినియోగం పూర్తిస్థాయి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌గా మారనుంది. ముఖ్యంగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉపయోగించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

విండోస్ యాప్ ఇన్‌స్టాల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, ఆఫీస్ కంప్యూటర్లు ఉపయోగించే ఉద్యోగులు ఈ ఫీచర్‌తో నేరుగా బ్రౌజర్ నుంచే గ్రూప్ కాల్స్ చేయగలుగుతారు. దీంతో డివైస్ మార్పు లేకుండా ఒకే స్క్రీన్‌పై చాటింగ్‌తో పాటు కాలింగ్ కూడా చేయడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ విడుదలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు. అయితే టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత దశలవారీగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అప్‌డేట్‌తో వాట్సాప్ వెబ్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com