ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం

- January 29, 2026 , by Maagulf
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం

దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆ దేశానికి చెందిన శాసనసభ్యుడు డియోజెనెస్ క్వింటెరో, రాజకీయ అభ్యర్థి కార్లోస్ సాల్సెడో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, కుకుటా నగరం నుంచి బయలుదేరిన సటేనా  ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ 1900 విమానం వెనిజులా సరిహద్దు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో కూలిపోయింది. మధ్యాహ్నం సమయంలో విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో అకస్మాత్తుగా సంబంధం కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కొద్ది గంటల తర్వాత శోధన బృందాలు ప్రమాద స్థలాన్ని గుర్తించాయి.

విమానం కూలిన ప్రాంతం అతి కఠినమైన భౌగోళిక పరిస్థితులు కలిగి ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. అయితే, సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు విమానంలోని ప్రయాణీకులందరూ మృతి చెందినట్లు ధృవీకరించాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు కొలంబియా పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

ఈ ప్రమాదంలో ప్రముఖ రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోవడంతో కొలంబియా రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. దేశ అధ్యక్షుడు, పలువురు నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విమాన ప్రమాదానికి గల సాంకేతిక లోపాలు లేదా వాతావరణ పరిస్థితులే కారణమా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com