ఆగస్ట్ 2న రాష్ట్ర బంద్ కు పిలుపు

- July 29, 2016 , by Maagulf
ఆగస్ట్ 2న రాష్ట్ర బంద్ కు పిలుపు

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల తీరు దుర్మార్గమన్న వైఎస్ జగన్ - నిరసనగా మంగళవారం (ఆగస్టు 2న) రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన ప్రతిపక్ష నేతహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంలో బీజేపీ, టీడీపీలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించడం, అయినా సరే ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం.. కేంద్ర ప్రభుత్వంలో నిర్లజ్జగా కొనసాగుతుండటం దారుణమని ఆయన విమర్శించారు. ఈ దుర్మార్గ వైఖరికి నిరసనగా, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిరంతరం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (ఆగస్ట్ 2న) రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ బంద్ లో పాల్గొనాల్సిందిగా, బంద్ కు అందరూ సహకరించాల్సిందిగా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పేర్కొన్నందువల్లే బీజేపీ ఈ నిర్ణయానికి రాగలిగిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏపీ ప్రజల భవిష్యత్తుతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని, తన మీద కేసులు లేకుండా చేసుకునే క్రమంలో జనానికి ఎంత ఆన్యాయం జరిగినా ఆయన నోరు మెదపడంలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. రాజ్యసభలో జరిగిన చర్చ, ఈ సందర్భంగా టీడీపీ ఎంపీలు, నాయకులు చేసిన ప్రకటనలు, రెండేళ్లుగా వారు ఆడుతున్న డ్రామాలు.. బీజేపీ, టీడీపీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమేనని, ఆ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ జగన్ ప్రకటనలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com