ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

- February 13, 2026 , by Maagulf
ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్‌ రహ్మాన్‌ ప్రకటన

బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) కూటమి భారీ ఆధిక్యంతో ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు వెలువడిన అనధికారిక ఫలితాల ప్రకారం బీఎన్‌పీ నేతృత్వంలోని కూటమి 211 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తూ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది. మెజారిటీకి అవసరమైన సగం మార్క్‌ను దాటే స్థాయిలో సీట్లు సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మిత్రపక్షాలతో కలిపి 211 స్థానాల్లో విజయం సాధించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో బీఎన్‌పీ ఛైర్‌పర్సన్‌ ఖాలిదా జియా కుమారుడైన తారిఖ్‌ రహ్మాన్‌ (Tariq-Rahman)నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఇక, జమాత్‌-ఎ-ఇస్లామీ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించింది.

అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికారిక ఫలితాలను బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఈసారి ఎన్నికల్లో బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రహ్మాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడైన ఆయన పోటీ చేసిన స్థానాల్లో ఘన విజయం సాధించినట్లు అనధికారిక సమాచారం. ముఖ్యంగా బోగురా-6 (సదర్) నియోజకవర్గంలో ఆయన సమీప ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మొత్తం 151 పోలింగ్ కేంద్రాల్లో 150 కేంద్రాల లెక్కింపు పూర్తయ్యాకే విజయం ఖాయమైంది. అయితే ఈ విజయోత్సవాల మధ్య బీఎన్‌పీ శ్రేణుల్లో సంతాప వాతావరణం నెలకొంది. ఎన్నికలకు ముందు ఖాలిదా జియా మరణించడంతో తారిఖ్ రహ్మాన్ పార్టీ కార్యకర్తలకు సంబరాలు నిర్వహించవద్దని సూచించారు. ఇక ఈ ఎన్నికలతో పాటు సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించడం విశేషం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం రూపొందించిన నేషనల్ చార్టర్ 2025 పేరిట 84 అంశాలతో కూడిన సంస్కరణల ప్యాకేజీపై ప్రజల అభిప్రాయాన్ని కోరారు. పాలన, ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య బలోపేతం వంటి రంగాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com