TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

- February 23, 2026 , by Maagulf
TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

తానా సంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఐదున్నర సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన 
“మన తెలుగు భాషను ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం, పరివ్యాప్తి చేద్దాం” అనే 89వ సభ చాలా విజయవంతంగా జరిగింది.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “మాతృభాష అనేది మన గుర్తింపు. అది మన మూలాలను గుర్తు చేస్తుంది, మన సంస్కృతిని నిలబెడుతుంది. ‘ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా, మాతృభాషను మరచిపోకూడదు, దాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, రక్షించాలి’ అనే సందేశాన్ని ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మనకు గుర్తుచేస్తుంది. మాతృభాషను కాపాడటం అంటే మన సాహిత్యం, జానపద గాధలు, సామెతలు, సంపూర్ణ సంస్కృతిని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. తల్లిదండ్రులు పిల్లలకు పసి వయస్సులోనే కథలు, పాటలు, పద్యాలు, నీతి కథలు లాంటివి మాతృభాషలో పరిచయం చేయాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు తెలుగుభాషకు సాంకేతిక పరిజ్ఞాన్ని జోడించి ప్రాధమిక స్థాయిలో కనీసం 5 వ తరగతి వరకు తెలుగుభాషలో విద్యాభోధన తప్పనిసరిచేసి, న్యాయ, పరిపాలనా రంగాలలో మాతృభాష వినియోగాన్ని పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు”. 

న్యూయార్క్ నుండి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రఖ్యాత కాన్సర్ వైద్యనిపుణులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ తన ప్రాధమిక, ఉన్నతవిద్య అంతా తెలుగు మాధ్యమంలోనే జరిగిందని, ఆ తర్వాతే వైద్య విద్య ఆంగ్ల మాధ్యమంలో జరిగిందని దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదని, దానికి కారణం మాతృభాషలో ప్రాధమికస్థాయిలో పట్టు సంపాదించడమే అన్నారు. అంతే గాక తాను కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు తన తెలుగు అధ్యాపకులు తెలుగు కవుల వైభవంపై చెప్పిన పద్యాలు, గద్యాలు ఇంకా గుర్తు ఉన్నాయని వాటిని చెప్పి అందరిని ఆశ్యర్యపరచారు. ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధించడానికి మాతృభాష ఆటంకం కాదు, అవసరం అన్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ప్రభుత్వాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది అన్నారు. 
            
విశిష్టఅతిథిగా పాల్గొన్న భారతదేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పూర్వ ఛైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ “మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, భారతదేశ పూర్వ రాష్ట్రపతి డా. ఎపిజె అబ్దుల్ కలాం చదువుకున్నది తన మాతృభాష అయిన తమిళం అని, జీవితంలో ఆయన అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి వారి మాతృభాష ఎక్కడా అవరోధం కాలేదన్నారు. నేను పుట్టి పెరిగింది నెల్లూరు జిల్లాలోని మహిమలూరు అనే చిన్న గ్రామం, చదువుకున్నది అంతా తెలుగు మాధ్యమంలోనే. ప్రతిష్టాత్మక DRDO సంస్థకు ఛైర్మన్ గా, రక్షణ మంత్రికి సలహాదారుగా వ్యవహరించే స్థితికి చేరుకోవడానికి నా తెలుగుభాష తోడ్పడిందే తప్ప అవరోధం కాలేదు అన్నారు. ఎంత ఎత్తకు ఎదిగినా మాతృభాషలో మాట్లాడడానికి గర్వపడాలే తప్ప సిగ్గు పడకూడదన్నారు. పిల్లలకు ఇళ్ళవద్ద తెలుగు నేర్పవలసిన భాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. ప్రభుత్వాలు చక్కని విధి విధానాలతో మాతృభాషకు ప్రాధ్యానం ఇవ్వాలన్నారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డి.మునిరత్నం నాయుడు తన విశ్వవిద్యాలయంలో తెలుగుభాష సంరక్షణ, పరివ్యాప్తి కోసం తీసుకుంటున్న చర్యలు సోదాహరణంగా వివరిస్తూ, అవి సాకారంగావడానికి ప్రవాసాంధ్రుల సహకారం ఎంతైనా అవసరం అన్నారు.

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఆచార్యులు డా.అఫ్సర్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, సియాటెల్ లో తెలుగు అధ్యాపకురాలు ఉమా అత్తోట, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కలీలో సౌత్ ఏషియన్ స్టడీస్ అధ్యాపకురాలు డా.భారతి శంకరరాజులు మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో వివిధ నగరాలలో పాటశాల, కళాశాల స్థాయిల నుండే తెలుగును ఒక కోర్సుగా ప్రవేశపెట్టే ఆలోచన చేయాలన్నారు. అంతేగాక ఇంటివద్ద పిల్లలకు అనునిత్యం సహజసిద్ధంగా తెలుగు వినబడేటట్లు, కనబడేటట్లు చేస్తూ, తప్పనిసరిగా తల్లిదండ్రులు తెలుగులోనే మాట్లాడితే పరదేశంలో భాష అస్తితత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం కల్గుతుందన్నారు.               
భీమవరంలో జన్మించి, హైదరాబాద్, లండన్ నగరాలలో ఉన్నత చదువులు చదివి, రాజకీయరంగంలో ప్రవేశించి, ప్రస్తుతం Royal Borough of Kensington and Chelsea, Central London, UK కు గౌరవనీయ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన ఆర్యన్ ఉదయ్ ఆరేటి మాట్లాడుతూ భారతదేశంనుండి వచ్చి బ్రిటన్ లో స్థిరపడిన గుజరాతీ, హిందీ, తమిళ, బెంగాలీ, మరాటా ప్రజలకున్న భాషాభిమానంతో పోలిస్తే మన తెలుగు వారికున్న భాషాభిమానం చాల తక్కువ అన్నారు. మనం ఎక్కడ ఉన్నా తెలుగు భాషను మరువకూడదు అన్నారు. 

తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంలో తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం అందరం కృషి చేద్దామనే సంకల్పంతో ముందుకు సాగుదాం అంటూ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు డా.నోరి దత్తాత్రేయుడుకి పద్మ భూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలుగుభాష వైభావాన్ని, ప్రస్తుత దుస్థితిని తాను రచించిన పద్యరూపాలలో ఆలపించి, ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడిన తానా కార్యవర్గ సభ్యులకు, ప్రసార మాధ్యమాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.
 

పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించ వచ్చును.

https://youtube.com/live/CgAoxJWOUus?feature=share

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com