విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- March 08, 2026
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ మహిళా సాధికారతకు విద్యే కీలకమని, విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించే విధంగా కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
శనివారం ఉదయం తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో 22వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఛాన్సలర్ హోదాలో పాల్గొనగా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఉమా వెన్నం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విశ్రాంత శాస్త్రవేత్త శశికళ సిన్హా, జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, ఎస్పి ఎల్. సుబ్బారాయుడు, మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య, యూనివర్సిటీ విసి ఉమా వెన్నం, రిజిష్ట్రార్ ఆర్ ఉష, డీన్ లు ప్రొఫెసర్ ఉమ, ప్రొఫెసర్ వాణి తదితరులు పాల్గొన్నారు.
స్నాతకోత్సవంలో భాగంగా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టరల్ కోర్సులకు చెందిన మొత్తం 2,591 మంది విద్యార్థినులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా డిగ్రీలు ప్రదానం చేశారు. వీరిలో 121 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన 99 విద్యార్థినులకు గోల్డ్ మెడల్స్, ఇద్దరికి సిల్వర్ మెడల్స్ తో పాటు పలు బుక్ మరియు నగదు బహుమతులు అందజేశారు.
మహిళా సాధికారతకు విద్య అత్యంత కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. విద్యావంతులైన మహిళలు కుటుంబాలను బలోపేతం చేయడంతో పాటు సమాజం మరియు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతారని తెలిపారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యం అవసరమని, ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, నానో టెక్నాలజీ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు.
విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, మలేషియా వంటి దేశాలతో విద్యా సహకారాన్ని బలోపేతం చేసిందన్నారు. PM-USHA పథకం కింద రూ.100 కోట్ల నిధులు లభించడం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కీలక మైలురాయి అని పేర్కొన్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త శశికళ సిన్హాకు డాక్టరేట్ ప్రదానం చేయడం గర్వకారణమని తెలిపారు.
డిఆర్డిఓ విశ్రాంత శాస్త్రవేత్త శశికళ సిన్హా మాట్లాడుతూ మహిళ జీవితంలో విద్య ఎంతో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మహిళలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలని తెలిపారు. నేర్చుకోవడం అలవాటుగా మారాలని, అది భవిష్యత్తుకు ఒక ప్రారంభమని పేర్కొన్నారు. వైస్-చాన్సలర్ మాట్లాడుతూ, మహిళా విశ్వవిద్యాలయంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందేందుకు కట్టుబడి ఉందన్నారు.
వైస్-చాన్సలర్ మాట్లాడుతూ, యువతిని నాయకత్వం, ఆవిష్కరణ మరియు సమాజ సేవ వైపు నడిపించే మహిళా విశ్వవిద్యాలయంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందేందుకు కట్టుబడి ఉందన్నారు. పట్టభద్రులు తమ విద్యతో సమాజానికి సేవ చేయాలని, దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం దాదాపు 100 పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, అధ్యాపకులు మరియు పరిశోధకులు 1000కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించగా, వాటికి 13,000కు పైగా సైటేషన్లు లభించాయని తెలిపారు. విశ్వవిద్యాలయానికి h-index 50 నమోదైందని వెల్లడించారు. అదేవిధంగా 80 పేటెంట్లు ప్రచురించబడగా, 22 పేటెంట్లు మంజూరయ్యాయి అని చెప్పారు.
ప్రస్తుతం 8 ఇన్నోవేషన్ మరియు ఇన్క్యుబేషన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యుబేటర్కు స్టార్టప్ ఇండియా పధకం కింద 2.10 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మొదటిసారిగా లభించిన మద్దతు అని చెప్పారు. హెల్త్ టెక్నాలజీ, సస్టైనబుల్ మెటీరియల్స్, డయాగ్నోస్టిక్స్, క్లీన్ ఎనర్జీ, మహిళల ఆరోగ్యం వంటి రంగాల్లో విద్యార్థులు మరియు పరిశోధకులు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు, మహిళా సంఘాలు మరియు యువతతో కలిసి పర్యావరణ అవగాహన, ఆరోగ్యం, డిజిటల్ లిటరసీ, సహజ వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









