రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బంద్

- August 01, 2016 , by Maagulf
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బంద్

ఏపీకి ప్రత్యేక హోదా దక్కని వైనంపై ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నేడు తెల్లవారకముందే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి ఆ పార్టీల నేతలు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను అడ్డుకుంటున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వైకాపా, సీపీఎం, సీపీఐ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వద్ద వామపక్షాల కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించరాదన్న భావనతో తిరుపతి నుంచి తిరుమల బయలుదేరే బస్సులను మాత్రం ఆందోళనకారులు అడ్డుకోలేదు. దీంతో తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులు యథాతథంగా తిరుగుతున్నాయి.
కడప ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబుతోపాటు కడప నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డిపోలోని రెండు గేట్లను మూసివేసి... బస్సులను నిలిపివేశారు. పులివెందుల బస్టాండ్ లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బస్సులను పార్టీ శ్రేణులు నిలిపివేశారు. ఈ ధర్నాలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
రైల్వేకోడూరు మండలం కుక్కల్ దొడ్డి వద్ద వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బద్వేల్ లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అలాగే స్థానిక బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు ధర్న నిర్వహించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com