ఏపీలో ప్రత్యేకహోదా నిరసనలు హోరెత్తుతున్నాయి

- August 02, 2016 , by Maagulf
ఏపీలో ప్రత్యేకహోదా నిరసనలు హోరెత్తుతున్నాయి

ఏపీలో ప్రత్యేకహోదా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కృష్ణాజిల్లా మచీలీపట్నంలో బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఆర్టీసీ బస్సు డిపోముందు వైసీపీ నేతలు బైఠాయించడంతో బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. దుకాణాలు, షాపింగ్‌మాల్స్ మూతపడ్డాయి. పట్టణంలో వందలాదిగా వైసీపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.కర్నూలులో.. కర్నూలు జిల్లాలో ప్రత్యేక హోదా బంద్‌ కొనసాగుతోంది. అఖిలపక్ష నాయకుల ఆందోళనలు, నిరసనలతో హోరెత్తుతోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సహా సీపీఎం, సీపీఐ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. పశ్చిమగోదావరి జిల్లా లో ప్రత్యేకహోదా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏలూరులో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వామపక్షాలు, వైసీపీ ఆధ్వర్యంలో బంద్‌ పూర్తిస్థాయిలో జరుగుతోంది. ద్వారకా తిరుమలలో షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసనలను దిగుతున్నారు.ప్రకాశం జిల్లాలో.. ఏపీలో ప్రత్యేకహోదా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజలు బంద్‌పాటిస్తున్నారు. ప్రకాశంజిల్లాలో లెఫ్ట్‌పార్టీలు, వైసీపీ ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగుతోంది. ప్రైవేట్‌స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన యాజమాన్యాలు బంద్‌కు మద్దతిచ్చాయి. ఆర్టీసీ డిపోల ముందు పెద్ద ఎత్తున పోలీసుబలగాలు మోహరించాయి. బీజేపీ సర్కార్‌ దిగివచ్చేవరకు నిరసనలు కొనసాగుతాయని ఆందోళనకారులు తేల్చిచెబుతున్నారు.చలసాని డిమాండ్స్.. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమైన రాయితీలు రాకుండా పోతాయని మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లుకు ఏ పార్టీ ఆమోదం తెలిపినా.. ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ ఎంపీలంతా జీఎస్టీ బిల్లును వ్యతిరేకించాలన్నారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com