యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?

- March 23, 2026 , by Maagulf
యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?

యూఏఈ: ఏప్రిల్  నెలకు సంబంధించిన పెట్రోల్ ధరలను యూఏఈ మార్చి 31న ప్రకటించనుంది. ప్రాంతీయ సంఘర్షణలు మరియు యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా, మార్చి మొదటి మూడు వారాల్లో ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి.  ఈ క్రమంలో ఏప్రిల్‌లో నెలలోనూ ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ చమురు ధరలలో వచ్చిన ఆకస్మిక పెరుగుదల కారణంగా అనేక దేశాలు ఇప్పటికే పెట్రోల్ ధరలను పెంచాయి.

బ్రెంట్ చమురు ధర కేవలం మూడు వారాల్లోనే 54 శాతం లేదా బ్యారెల్‌కు $39.32 మేర పెరిగింది.  ఫిబ్రవరి చివరిలో బ్యారెల్‌కు $72.87 ఉన్న ధర, మార్చి 20న మార్కెట్లు ముగిసే సమయానికి బ్యారెల్‌కు $112.19కి చేరింది. మిడిలీస్టులో సైనిక సంఘర్షణ కారణంగా గత వారం ఈ ధర బ్యారెల్‌కు $118 కంటే ఎక్కువ గరిష్ట స్థాయిని తాకింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో బ్రెంట్ ధర బ్యారెల్‌కు సుమారు $125 వద్ద ఉన్నప్పుడు కనిపించిన స్థాయిలకు దగ్గరగా ప్రస్తుతం చమురు ధరలు ట్రేడ్ అవుతున్నాయి. ఏప్రిల్ 2022లో యూఏఈలో 'Super 98' పెట్రోల్ ధర లీటరుకు Dh3.74కి, అలాగే 'స్పెషల్ 95' ధర లీటరుకు Dh3.62కి పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో జూన్ 2022లో ధరలు లీటరుకు Dh4 మార్కును మొదటిసారిగా అధిగమించాయి.

యూఏఈలో  ప్రపంచ ధరలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు, మార్చి 2026లో పెట్రోల్ ధరలను లీటరుకు సుమారు Dh0.14 మేర పెంచారు.

యూఏఈ మార్చి నెలలో 'Super 98' పెట్రోల్ ధరను లీటరుకు Dh2.59కి పెంచింది.  ఇది ఫిబ్రవరిలో Dh2.45 గా ఉంది. 'Special 95' ధరను లీటరుకు Dh2.48కి పెంచారు. ఇది అంతకుముందు Dh2.33 గా ఉంది. గత నెలలో లీటరుకు Dh2.26గా ఉన్న E-Plus 91 ధర, మార్చిలో లీటరుకు Dh2.40కి పెరిగింది. ఈ నెలలో డీజిల్ ధరను లీటరుకు Dh0.20 పెంచి Dh2.72కి చేర్చారు.

ఇదిలా ఉండగా, వచ్చే నెలకు సంబంధించిన అధికారిక పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ మార్చి 31న ప్రకటించనుంది. ప్రాంతీయ సైనిక ఘర్షణ తీవ్రతరం కావడంతో సోమవారం ఉదయం ప్రపంచ చమురు ధరలు మరింత పెరిగాయి.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న మధ్యప్రాచ్య సైనిక ఘర్షణ కారణంగా, మార్చి 2026 మొదటి మూడు వారాల్లో బ్రెంట్ సగటు ముగింపు ధర గత నెలలోని $68.92తో పోలిస్తే $92 దాటింది.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ నాయకత్వం, సైనిక మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభించడంతో మీడిలీస్టులో ఘర్షణ చెలరేగి, ధరలు మరింత పెరిగాయి.

యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిని నౌకలు, చమురు ట్యాంకర్ల రాకపోకలకు మూసివేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రపంచ చమురులో సుమారు 20 శాతం ప్రతిరోజూ ఈ జలసంధి గుండా వెళుతుంది. దీనికి తోడు, యుద్ధంలో ఉన్న దేశాలు ఇరాన్ మరియు ఖతార్‌లోని ఇంధన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దాడి చేయడంతో, సరఫరాపై ఆందోళనలు మరింత పెరిగాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com