రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- April 01, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) ఆధ్వర్యంలో ఉగాది మరియు ఈద్ మిలాప్ వేడుకలు ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలకు ఈ వేడుకలు తమ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసే ఆత్మీయ వేదికగా నిలిచాయి.
కుటుంబ సభ్యులు, పిల్లలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగాది పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు ఈద్ మిలాప్ ద్వారా మత సామరస్యాన్ని చాటిచెప్పారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమాజ ఐక్యతను ప్రతిబింబించే అంశాలు, ప్రేరణాత్మక సందేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వేదికపై పండితుడు మురళి ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించగా, ఇమామ్ ముజమ్మిల్ ఈద్ మిలాప్ మరియు రమదాన్ మాసం విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా మతాలు వేర్వేరు అయినా మనమందరం ప్రేమ, శాంతి, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలనే గొప్ప సందేశం సమాజానికి అందించారు.
సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ, ఉగాది తెలుగు ప్రజలకు కొత్త సంవత్సర ఆరంభమైతే, ఈద్ ప్రేమ, సహనం, దానం, సోదరభావానికి ప్రతీక అని అన్నారు. “మతాలు వేరైనా మనమందరం ఒకటే” అనే భావనతో ఈ రెండు పండుగలను కలిసి జరుపుకోవడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో తెలుగు వారికి ఎలాంటి కష్టం వచ్చినా సాటా కోర్ టీమ్ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.
అలాగే ఆయన తెలుగు సమాజంలో పరస్పర సహకారం, సానుభూతి పెరగాలని, ఒకరిని ఒకరు శత్రువులుగా కాకుండా స్నేహపూర్వకంగా పలకరించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి హాజరైన టాసా సౌదీ అరేబియా అధ్యక్షుడు స్వామి స్వర్ణ మాట్లాడుతూ, ఒకే వేదికపై శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు ఈద్ మిలాప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలుగు సంఘాలు వేర్వేరు అయినప్పటికీ, మనమందరం తెలుగు వారమూ భారతీయులమనే భావనతో ముందుకు సాగడం ఎంతో గొప్ప విషయమని చెప్పారు. సాటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు టాసా తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సాటా ఫౌండర్ మల్లేశన్, కోర్ టీమ్ సభ్యులు శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, యోగేశ్వరరావు వీరవల్లి, సింగ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీకృష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్, ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), ఫణి కుమార్ అయ్యగారి, పెంటపాటి శ్రీచరణ్, మహమ్మద్ కమిల్, దూడం సంజీవ్, శేఖర్ పదాల తదితరులు పాల్గొని తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలిపారు.
ఈ వేడుకలు రియాద్‌లోని తెలుగు సమాజాన్ని మరింత దగ్గర చేస్తూ, ఐక్యతను బలోపేతం చేసే వేదికగా నిలిచాయని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









