మోదీ తెలంగాణ పర్యటన టీఆర్ఎస్ చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యం..

- August 04, 2016 , by Maagulf
మోదీ తెలంగాణ పర్యటన టీఆర్ఎస్ చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యం..

: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని పర్యటన కోసం టీఆర్ఎస్ చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్డీయే కూటమితో సంబంధంలేకుండా ఉన్న టీఆర్ఎస్ ప్రధాని రాకకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని కోమటిబండ దగ్గర మిషన్ భగీరథను లాంఛనంగా ప్రధాని ప్రారంభిస్తారు. అక్కడి నుండి రాష్ట్రంలోని మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను మోదీ రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. మోదీ పాల్గొనే ఈ బహిరంగ సభకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. 2 లక్షల మందిని సభకు తరలించాలని కేసీఆర్ టార్గెట్ పెట్టారట. అంతేకాదు మోదీ పర్యటనపై సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రధాని పర్యటన కోసం టీఆర్ఎస్ సర్కార్ చేస్తోన్న ఏర్పాట్లు ఆసక్తిని కలిగిస్తోంది. సహజంగా సొంత పార్టీ లేదా మిత్రపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట మాత్రమే ప్రధాని పాల్గొనే సభకు భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న చోట మొక్కుబడిగా ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ లెక్కన చూస్తే టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మిత్రపక్షం కాదు. కనీసం బయట నుంచి కూడా మద్దతు తెలపడం లేదు. మరి ఎందుకు టీఆర్ఎస్ ప్రధాని పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నిన్నమొన్నటి వరకు బీజేపీతో ఉప్పునిప్పులా ఉన్న తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. కేంద్రంతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు కావాలంటే కేంద్రంతో సయోధ్య అవసరం అని గ్రహించింది. భవిష్యత్ అవసరాల కోసం కేంద్రం కూడా తెలంగాణపై వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో మద్దతుతో పాటు రాష్ట్రపతి ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణపై కొంత సానుకూల అభిప్రాయంలో ఉంటోందని అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com