భారత్‌ అభిప్రాయాన్ని స్పష్టంగా విన్పించారు : రాజ్‌నాథ్‌ సింగ్‌

- August 04, 2016 , by Maagulf
భారత్‌ అభిప్రాయాన్ని స్పష్టంగా విన్పించారు : రాజ్‌నాథ్‌ సింగ్‌

పాకిస్థాన్‌లో జరుగుతున్న సార్క్‌ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత్‌ అభిప్రాయాన్ని స్పష్టంగా విన్పించారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల పట్ల ఆయన పదునైన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థలపైనే కాకుండా వాటికి మద్దతిస్తున్న సంస్థలు, దేశాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ నుంచి భారత్‌లో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. .అలాగే ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కొనడంపైనా రాజ్‌నాథ్‌ మండిపడ్డారు. ఉగ్రవాదులను అలా పొగడడం తగదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో భద్రతాసిబ్బంది హతమార్చిన హిజ్బుల్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వానిని పాకిస్థాన్‌ యోధుడిగా పేర్కొనడాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి ఉగ్రవాదులు, చెడ్డ ఉగ్రవాదులు ఉండరు.. ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమే అని రాజ్‌నాథ్‌ ఇస్లామాబాద్‌లో సార్క్‌ దేశాల హోం మంత్రుల సమావేశంలో అన్నారు.బుర్హాన్‌ వానిని మట్టుపెట్టిన అనంతరం కశ్మీర్‌లో కల్లోల పరిస్థితులు, భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని పాకిస్థాన్‌ అధికార పీటీవీలో ప్రసారం చెయ్యలేదు. అలాగే భారత మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. హిజ్బుల్‌, లష్కరే ఉగ్రవాద సంస్థలు పాక్‌లో రాజ్‌నాథ్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశాయి. పాక్‌ హోం మంత్రితో రాజ్‌నాథ్‌ కరచాలనం సార్క్‌ సమావేశానికి వచ్చిన మంత్రులను సమావేశం జరగనున్న సెరెనా హోటల్‌ వద్ద పాక్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి నిసార్‌ అలీ ఖాన్‌ స్వాగతం పలికారు. ఆ సమయంలో రాజ్‌నాథ్‌ నిసార్‌తో కరచాలనం చేశారు. సార్క్‌ సమావేశానికి ముందు వీరిద్దరూ తొలిసారి అప్పుడే కలుసుకున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా షేక్‌హ్యాండ్‌ ఇచ్చి రాజ్‌నాథ్‌ ముందుకు వెళ్లిపోయారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు ఉండబోవని భారత్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com