టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- April 08, 2026
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలైన పురాతన ఆలయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం భక్తి మార్గమే కాకుండా, పర్యాటక రంగాన్ని ఉపాధి వనరుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది.
తెలంగాణలో ప్రవహించే పవిత్ర గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కారిడార్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 జూన్-జూలై నెలల్లో రానున్న ‘గోదావరి పుష్కరాల’ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి మొదలుకొని ధర్మపురి, వేములవాడ రాజన్న, కాళేశ్వరం, రామప్ప, మేడారం మీదుగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు ఈ టెంపుల్ సర్క్యూట్ విస్తరించి ఉంటుంది. పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 500 కోట్ల నిధులు కేటాయించగా, బాసరలో రూ. 225 కోట్లతో మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తరహాలో ఆలయ పరిసరాల్లో రాజకీయాలకు తావు లేకుండా, కేవలం ఈవీ (EV) వాహనాలను మాత్రమే అనుమతించేలా కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించి VTDA (వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) ద్వారా పనులను పర్యవేక్షిస్తోంది. ప్రధాన ఆలయ విస్తరణ, అన్నదాన సత్రం, డ్రైనేజీ పైప్లైన్ల వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. అదేవిధంగా, భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రం కోసం రూ. 550 కోట్ల భారీ ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా తొలి దశలో రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ, గోదావరి ఘాట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భూమి పూజ చేశారు. ఈ అభివృద్ధి పనుల వల్ల భక్తులకు ఆధునిక సౌకర్యాలు అందడమే కాకుండా, భద్రాచలం ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అక్కడ ఐలాండ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. మేడారం జాతర ప్రాంగణాన్ని రూ. 250 కోట్లతో రాతి నిర్మాణాలతో శాశ్వత కట్టడంగా మార్చడం విశేషం. దీనికి తోడు ములుగు అటవీ ప్రాంతంలోని మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, లక్నవరం అందాలను కూడా ఈ సర్క్యూట్లో జోడించారు. ఇక హైదరాబాద్ పరిధిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా గండిపేట–మంచిరేవులలోని 1400 ఏళ్ల చరిత్ర కలిగిన వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఏకంగా రూ. 700 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ భారీ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే టెంపుల్ టూరిజంకు ప్రధాన చిరునామాగా నిలవనుంది.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్‌లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్‌తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







