గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- April 13, 2026
సైబరాబాద్: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రతి వాహనదారుడు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉన్నత లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలో ఈరోజు చేపట్టారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ స్వయంగా పాల్గొని ద్విచక్ర వాహనదారులు, పాదచారులు మరియు ఇతర వాహనదారులతో నేరుగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్ మాట్లాడుతూ, రక్తసిక్తమైన రోడ్లను చూడటం పోలీసులకు ఏమాత్రం ఇష్టం లేదని, ప్రతి పౌరుడు క్షేమంగా తమ ఇంటికి చేరుకోవడమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. అంబులెన్సులు అవసరం లేని రోడ్డు వ్యవస్థను నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
ద్విచక్ర వాహనదారుల భద్రత గురించి సీపీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ,హెల్మెట్ ధరించడం కేవలం ఒక నిబంధన మాత్రమే కాదని, అది ప్రాణ రక్షణ కవచమని గుర్తుచేశారు. కేవలం హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదని, దాని స్ట్రాప్ (బెల్ట్) తప్పనిసరిగా బిగించాలని, లేనిపక్షంలో అది ప్రమాద సమయంలో ఎగిరిపోయి రక్షణ కల్పించలేదని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు మాత్రమే కాకుండా, వెనుక కూర్చునే వారు మరియు 4 సంవత్సరాల పైబడిన పిల్లలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదేవిధంగా కార్లలో ప్రయాణించే వారందరూ, డ్రైవర్‌తో సహా సీటు బెల్టు ధరించడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని వివరించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ (రక్షణాత్మక డ్రైవింగ్) కీలక పాత్ర పోషిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉన్నందున, పరిసరాలను నిరంతరం గమనిస్తూ, ప్రమాదాలను ముందుగానే ఊహించి వాహనాన్ని నియంత్రించడమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలని, చిన్న రోడ్ల నుండి ప్రధాన రహదారుల్లోకి వచ్చేటప్పుడు ఇరువైపులా గమనించాలని సూచించారు. రోడ్డుపై వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మరియు పాదచారుల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పాదచారులు జంక్షన్ ల వద్ద పోలీస్ సిబ్బంది సహకారంతో జాగ్రత్తగా రోడ్డు దాటాలని సూచించారు.
వేగం పెరిగే కొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతుందని, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు కూడళ్ల వద్ద వేగ పరిమితిని తప్పక పాటించాలని సూచించారు. మద్యం లేదా మాదకద్రవ్యాల ప్రభావంతో వాహనం నడపడం ఆత్మహత్యాసదృశ్యమని, అలాగే అలసటతో ఉన్నప్పుడు ప్రయాణించవద్దని సూచించారు.సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారు ప్రతి 2 గంటలకు ఒకసారి విరామం తీసుకోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుందని తెలిపారు. భారీ వాహనాలు రహదారికి ఎడమ వైపున మాత్రమే ప్రయాణించాలని, ఆకస్మికంగా ఓవర్ టేక్ చేయకూడదని హెచ్చరించారు.
చివరగా, రోడ్డుపై వాహనదారులు ప్రదర్శించే క్రమశిక్షణ మరియు సత్ప్రవర్తన ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తాయని సీపీ పేర్కొన్నారు.కోపం, అసహనం వంటి భావోద్వేగాలు డ్రైవింగ్‌పై ప్రభావం చూపుతాయని, తోటి ప్రయాణికులతో, చిరునవ్వు తో మర్యాదగా మెలగాలని సూచించారు. అనవసరంగా హారన్ మోగించి ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని, వాహనానికి వాహనానికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని కోరారు. ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించనున్న ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం రావాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను స్వచ్ఛందంగా పాటిస్తూ సురక్షిత ప్రయాణాన్ని సాగించాలని సీపీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్, ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్-1 అదనపు డీసీపీ హనుమంతరావు, మాధాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్, రాయదుర్గం ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ హనిమిరెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు మొదలగువారు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







