సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!

- April 18, 2026 , by Maagulf
సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!

రియాద్ః సౌదీ అరేబియా క్యాబినెట్ మనీలాండరింగ్ నిరోధక చట్టానికి సవరణలను ఆమోదించింది. ఇందులో భాగంగా దోషులుగా తేలిన నేరస్థులపై ప్రయాణ నిషేధాన్ని విధించడం, ఆస్తులను జప్తు చేసే చర్యలను విస్తరించడం వంటి కొత్త నిబంధనలను చేర్చింది. సవరించిన ఆర్టికల్ 28 ప్రకారం.. మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష పడిన సౌదీ జాతీయులపై, అంతే కాలానికి విదేశాలకు ప్రయాణించకుండా నిషేధం విధిస్తారు.  అదే సౌదీయేతర నేరస్థులు తమ శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత దేశం నుండి బహిష్కరిస్తారు. నిబంధనల ప్రకారం హజ్ లేదా ఉమ్రా యాత్రలకు మినహా తిరిగి రాజ్యంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారు.  
ఆర్టికల్ 33 ప్రకారం.. నేరం రుజువైనప్పుడు, కోర్టులు మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన నిధులు, సంబంధిత ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించవచ్చు.  నేరస్థుని చట్టబద్ధమైన ఆదాయానికి మించి ఉన్న ఆస్తులు, అలాగే నేర కార్యకలాపాల నుండి వచ్చినవని రుజువైతే, న్యాయస్థానాలు వాటిని కూడా జప్తు చేయవచ్చు.

సవరించిన నిబంధనల ప్రకారం.. ఆస్తులు నేరంతో ముడిపడి ఉన్నాయని రుజువైతే, అవి నేరస్థుని వద్ద ఉన్నా లేదా మూడవ పక్షం వద్ద ఉన్నా సరే వాటిని జప్తు చేయడానికి న్యాయస్థానాలకు అధికారం ఉంది.  అలాగే, లావాదేవీలు లేదా కార్యకలాపాలను రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి కూడా న్యాయస్థానాలకు అధికారం ఉంటుంది. ఈ సవరణలలో చట్టంలోని అనేక నిబంధనల నుండి “లాభాపేక్ష లేని సంస్థలు” అనే పదాన్ని తొలగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com