పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి

- April 27, 2026 , by Maagulf
పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి

మచిలీపట్టణం: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఛైర్మన్ అరవిందర్ సింగ్ షాని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ఛైర్మన్ సంజయ్ ఖన్నా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) ఛైర్మన్ వికాస్ కౌశల్‌లతో తాను నేరుగా మాట్లాడినట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఈరోజు, రేపటిలో పెట్రోల్, డీజిల్ సరఫరా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడిన అనంతరం పరిస్థితి సుమారు 90 శాతం వరకు పరిష్కారమైందని సమాచారం అందిందని బాలశౌరి తెలిపారు. రేపటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి సాధారణ సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్ మరియు మైనింగ్ ఆపరేటర్లు కమర్షియల్ అవుట్‌లెట్లకు బదులుగా రిటైల్ అవుట్‌లెట్ల నుంచి ఇంధనం పొందడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం వాహనాలకు నిర్దిష్ట పరిమితులు విధించి సరఫరాను క్రమబద్ధీకరించడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందన్నారు.

అనవసర ఆందోళనలు, అపోహలకు లోనుకాకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు ఆయిల్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com