చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!

- April 28, 2026 , by Maagulf
చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!

అబూదాబి: యూఏఈ ఓపెక్ (OPEC) మరియు ఓపెక్+ కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం 2026 మే 1 నుంచి అమల్లోకి రానుంది. దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ వెల్లడించింది.

దేశీయ ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులను వేగవంతం చేయడం, మారుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా స్పందించడం, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో బాధ్యతాయుతమైన పాత్రను కొనసాగించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

యూఏఈ ఉత్పత్తి విధానంపై సమగ్ర సమీక్ష అనంతరం, ప్రస్తుత మరియు భవిష్యత్ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు.

ప్రస్తుతం అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఏర్పడుతున్న అంతరాయాలు తాత్కాలిక ప్రభావం చూపుతున్నప్పటికీ, మధ్య మరియు దీర్ఘకాలంలో గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతుందని యూఏఈ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో స్థిరమైన, సరసమైన, విశ్వసనీయ ఇంధన సరఫరా అవసరాన్ని యూఏఈ పునరుద్ఘాటించింది.

1967లో అబూదాబి ద్వారా ఓపెక్‌లో చేరిన యూఏఈ, 1971లో దేశ ఏర్పాటుకు అనంతరం సభ్యత్వాన్ని కొనసాగించింది. ఈ కాలంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరత్వానికి, ఉత్పత్తిదారుల మధ్య సమన్వయానికి కీలక పాత్ర పోషించింది.

ఓపెక్ నుంచి నిష్క్రమించిన తరువాత కూడా యూఏఈ గ్లోబల్ మార్కెట్లకు బాధ్యతాయుతంగా, దశలవారీగా ఉత్పత్తిని అందిస్తుందని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.

తక్కువ కార్బన్ ఉద్గారాలతో, పోటీదారుల కంటే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే దేశంగా యూఏఈ ప్రపంచ ఇంధన రంగంలో కీలక భాగస్వామిగా కొనసాగుతుందని పేర్కొంది. ఆయిల్, గ్యాస్, పునరుత్పాదక శక్తి, లో-కార్బన్ టెక్నాలజీలలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపింది.

ఓపెక్ మరియు ఓపెక్+తో ఐదున్నర దశాబ్దాల సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా గ్లోబల్ మార్కెట్ స్థిరత్వానికి సహకారం కొనసాగిస్తామని యూఏఈ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com