మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- May 04, 2026
హైదరాబాద్: దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలను నింపే మహత్తర సేవా కార్యక్రమంగా నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరం హృదయాలను కదిలించింది.
సంవత్సరాలుగా ఆగిపోయిన అడుగులు మళ్లీ కదలడం, చేతులు కోల్పోయిన వారు స్వయంగా నీళ్లు తాగడం వంటి భావోద్వేగ దృశ్యాలు అందరినీ కదిలించాయి.
మేక్ ఎ ఛేంజ్ ఫౌండేషన్ (యూకే), శ్రీ స్వామినారాయణ ఆలయం, విలెస్డెన్ (యూకే) తదితర సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 745 మంది దివ్యాంగులకు 815 నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలు, కాలిపర్లు ఉచితంగా అందజేశారు.కొందరికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు అమర్చారు.
ఈ శిబిరాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని “మానవతకు నిలువెత్తు నిదర్శనం”గా గవర్నర్ అభివర్ణించారు.లబ్ధిదారులతో మమేకమై, పరేడ్‌ను వీక్షిస్తూ వారిని ప్రోత్సహించారు.“ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు సేవా మహిమాన్వితాన్ని తెలియజేస్తున్నాయి. కరుణ, సామూహిక కృషి కలిసి అద్భుత ఫలితాలు సాధిస్తాయని ఇది నిరూపిస్తోంది” అని పేర్కొన్నారు. సంస్థ అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్
నాయకత్వాన్ని గవర్నర్ ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి T.G.భరత్ మాట్లాడుతూ, “ఇది కేవలం సేవ కాదు…జీవితాలను మార్చే యజ్ఞం” అని అన్నారు. దివ్యాంగులను సమాజ ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలకమని పేర్కొంటూ, తన నియోజకవర్గంలో కూడా ఇలాంటి శిబిరం నిర్వహిస్తామని వెల్లడించారు.
ముందస్తు ఎంపిక శిబిరంలో వెయ్యికి పైగా మంది నమోదు కాగా, అందులో 745 మందికి ఈ శిబిరంలో సేవలు అందించినట్లు ట్రస్టీ & డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా తెలిపారు. జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ఆధునిక కృత్రిమ అవయవాలను అమర్చడమే కాకుండా, వాటి వినియోగం, నిర్వహణపై శిక్షణ కూడా అందించినట్లు వివరించారు. అనంతరం దాతలను సన్మానించారు.ఎమ్మెల్సీ బొగ్గుర దయానంద్ పాల్గొనీ సంస్థ సేవలను అభినందించారు.
1985లో కైలాస్ మానవ్ స్థాపించిన ఈ సంస్థ ఇప్పటి వరకు 39 వేల మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు అందించగా, 4.5 లక్షలకు పైగా మందికి వైద్య సేవలు అందించింది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్‌లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









