హర్మూజ్‌లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు

- May 08, 2026 , by Maagulf
హర్మూజ్‌లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు

హర్మూజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. తమ యుద్ధనౌకలపై ఇరాన్ దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించగా, అమెరికానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇరాన్ ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.

డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం, హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన మూడు యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవులతో దాడికి ప్రయత్నించింది. అయితే అమెరికా బలగాలు వెంటనే ప్రతిస్పందించి దాడిని తిప్పికొట్టాయని ఆయన తెలిపారు. ఈ ఘటనలో తమ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు.

అమెరికా జరిపిన ప్రతిదాడిలో ఇరాన్ దళాలకు భారీ నష్టం జరిగిందని ట్రంప్ వెల్లడించారు. శాంతి ఒప్పందంపై ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అయితే అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. అమెరికానే ముందుగా కాల్పుల విరమణను ఉల్లంఘించి తమ నౌకలపై దాడి చేసిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆరోపించారు. దానికి ప్రతిస్పందనగానే అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొన్నారు.

ఈ పరిణామాల తర్వాత టెహ్రాన్, బందర్ అబ్బాస్ వంటి ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో, అక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com