కాబూల్‌ లో మరోసారి విదేశీయులు కిడ్నాప్‌కు గురయ్యారు..

- August 08, 2016 , by Maagulf
కాబూల్‌ లో మరోసారి విదేశీయులు కిడ్నాప్‌కు గురయ్యారు..

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌ నగరంలో ఓ అమెరికన్‌ వ్యక్తిని, ఓ ఆస్ట్రేలియన్‌ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్‌ చేశారు. తరచూ విదేశీయులను అపహరిస్తున్న ఈ ప్రాంతంలో మరోసారి విదేశీయులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వీరిద్దరినీ నిన్న దుండగులు అపహరించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. అయితే ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చెయ్యలేదు. దార్‌-ఉల్‌-అమన్‌ రోడ్డుపై తుపాకీతో బెదిరించి కిడ్నాప్‌లు చేసే ముఠా ఇద్దరు విదేశీయులను అపహరించిందని సెక్యురిటీ అధికారి స్పష్టంచేశారు.ఆఫ్ఘనిస్థాన్‌లో కిడ్నాప్‌కు గురైన భారతీయ మహిళ జుడిత్‌ డిసౌజాను కాపాడిన రెండు వారాల అనంతరం మరోసారి కిడ్నాప్‌లు జరిగాయి. అమెరికన్‌ దేశస్థుడు కాబూల్‌లో కిడ్నాపైనట్లు తెలిసిందని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. కానీ ఈ అంశంపై వివరంగా స్పందించలేదు. ఆస్ట్రేలియా కూడా తమ పౌరుడు కిడ్నాపైనట్లు అక్కడి ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ద్వారా తెలిసిందని వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ అంశంపై ఎక్కువగా స్పందించడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో ఆఫ్ఘనిస్థాన్‌లో విదేశీయుల కిడ్నాప్‌లు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com