ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

- May 23, 2026 , by Maagulf
ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు

దోహా: ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఖతార్ ఆధ్వర్యంలో, మద్దిపాటి నరేష్ నాయకత్వంలో నిర్వహించిన స్వర్గీయ పద్మశ్రీ డా.నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 104వ జయంతి వేడుకలు మరియు మినీ మహానాడు కార్యక్రమం దోహాలో అత్యంత వైభవంగా జరిగింది. 

ఖతార్‌లోని అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర మరియు దోహా ప్రాంతాల నుంచి తెలుగు ప్రవాసులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం మొత్తం ఎన్టీఆర్ నినాదాలతో మారుమోగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారథి హాజరై ప్రసంగించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత అని కొనియాడారు.

“మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గీతంతో ప్రారంభమైన సభ దేశభక్తి, తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాగింది. చిన్నారుల కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఎన్టీఆర్ పాత్రలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన సోలో యాక్ట్స్‌కు ఘనమైన స్పందన లభించింది.

అదేవిధంగా “యుగపురుషుడు.. ఆంధ్రుల అన్న.. స్వర్గీయ పద్మశ్రీ డా.ఎన్టీఆర్ 104వ జయంతి సందర్భంగా రచించిన ప్రత్యేక గీతాన్ని” మంత్రి కొలుసు పార్థసారథి అధికారికంగా విడుదల చేశారు.ఈ గీతం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సభలో భాగంగా పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా దోహా నుంచి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలకు త్వరితగతిన ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానం చేశారు.అలాగే గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న బ్లూ కాలర్ కార్మికులకు ఏపీఎన్‌ఆర్టీ సేవలను మరింత విస్తృతంగా అందించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా “ఎన్‌ఆర్‌ఐ గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా తెలుగు ప్రవాసుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రవాస ఆంధ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా ఖతార్‌లో 25 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ తెలుగు సమాజానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ప్రత్యేకంగా సత్కరించారు. మంత్రి కొలుసు పార్థసారథి జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

అనంతరం కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, మినీ మహానాడు సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో ఖతార్ టీడీపీ నాయకులు మద్దిపోటీ నరేష్, పొనుగుమాటి రవి, విక్రమ్ సుఖవాసి, బొద్దు రామారావు, జేవీవీ సత్యనారాయణ, మల్లిరెడ్డి సత్యనారాయణ, నూతలపాటి నరేష్, కొడాలి సుధాకర్, మల్లేశ్వరరావు తదితరులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com