గుల్మార్గ్‌ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం

- May 26, 2026 , by Maagulf
గుల్మార్గ్‌ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రం గుల్మార్గ్‌లో సోమవారం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఇక్కడి ప్రసిద్ధ గోండోలా కేబుల్ కార్ సిస్టమ్‌లో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చిన్నారులు, మహిళలతో సహా సుమారు 300 మందికి పైగా పర్యాటకులు గంటల తరబడి గాల్లోనే చిక్కుకుపోయారు. దాదాపు ఏడు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగిన భారీ రెస్క్యూ ఆపరేషన్ అనంతరం అందరినీ క్షేమంగా రక్షించడంతో పర్యాటకులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం గుల్మార్గ్‌లోని గోండోలా మొదటి దశ, సర్వీసులో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో మొత్తం 65 కేబుల్ కార్ క్యాబిన్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కొన్ని క్యాబిన్లు నేలకు దాదాపు 500 అడుగుల ఎత్తులో వేలాడుతుండటంతో లోపల ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. బలమైన గాలులు వీస్తుండటంతో క్యాబిన్లు ఊగుతూ పర్యాటకులను మరింత భయపెట్టాయి.

రంగంలోకి సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాయి. భారత సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం (NDRF), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (SDRF) మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రతికూల వాతావరణం, లోయలు ఉన్నప్పటికీ సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగాయి. ప్రత్యేక తాడులు, అత్యాధునిక రెస్క్యూ పరికరాల సహాయంతో ఒక్కో క్యాబిన్ వద్దకు చేరుకుని, లోపల ఉన్న పర్యాటకులను సురక్షితంగా కిందికి దించారు. సుమారు 7 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఒక్క పర్యాటకూడికి కూడా గాయం కాకుండా రెస్క్యూ బృందాలు సురక్షితంగా కిందకు చేర్చాయి. ఈ ధైర్యసాహసాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఉన్నత స్థాయి విచారణకు సీఎం ఒమర్ అబ్దుల్లా ఆదేశం

ఈ తీవ్రమైన సాంకేతిక లోపంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. “పర్యాటకుల భద్రత విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించబోం. ఈ లోపానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం” అని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఈ సహాయక చర్యలను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, డీజీపీ నలిన్ ప్రభాత్ స్వయంగా పర్యవేక్షించారు.

ఈ ప్రమాదం నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, కేబుల్ కార్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించేందుకు మే 26, 27 తేదీల్లో గుల్మార్గ్ గోండోలా సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు రోజులకు గానూ ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న పర్యాటకులకు పూర్తి నగదును వాపసు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com