ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- May 28, 2026
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలని చాలా మంది కలలు కంటారు. ఈ శిఖరాన్ని అధిరోహించడం అంత తేలికైన పని కాదు. అందుకు ఎంతో కఠినమైన శిక్షణ అవసరం. ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కొన్ని సందర్భాల్లో అవేమీ అక్కరకు రాక.. మంచు కొండల్లో మృత్యువు ఆవహిస్తుంది. తాజాగా హైదరాబాద్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడికి వెళ్లిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ (53) ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. మంచు కొండల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేస్తోంది. అరుణ్ కుమార్ విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినప్పటికీ.. తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తున ఉన్న ప్రమాదకర ప్రాంతంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఎవరెస్ట్ నుంచి కిందకు ప్రయాణం ప్రారంభించిన అరుణ్ కుమార్.. హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులు చేసుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనతో ఉన్న షెర్పాలు వెంటనే స్పందించి.. అరుణ్ కుమార్ ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. తిరుగు ప్రయాణ సమయంలో అక్కడ ఉన్న విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల వల్ల అరుణ్ కుమార్ మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. పైగా డెత్ జోన్ గా పిలుచుకునే ఈ ప్రాంతం నుంచి అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.
పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకువస్తానని చెప్పింది. అందుకు గాను తమకు రూ. 1.1 కోట్లు చెల్లించాలని తెలిపింది. ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించింది. 8,000 మీటర్ల ఎత్తున.. మంచులో కూరుకుపోయిన అరుణ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీసి ఆపై కిందకు తీసుకురావాలంటే దాదాపు 8-10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఇంత భారీ మొత్తాన్ని కోరుతున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.
అయితే ఇలాంటి ప్రమాదకర ఆపరేషన్లకు బీమా వర్తించదా అని ప్రశ్నిస్తే.. కేవలం హెలికాప్టర్ల ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే బీమా కంపెనీలు నిధులు ఇస్తాయని.. మానవ ప్రయత్నంతో (షెర్పాల ద్వారా) చేసే వాటికి నిధులు కేటాయించవని సదరు కంపెనీ తెలిపింది.
ఈ పరిస్థితులు, భారీ ఖర్చుతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు. అరుణ్ కుమార్ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు. ‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో ఐక్యమయ్యారు’ అంటూ తమ నిర్ణయాన్ని తెలుపుతూ అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
తాజా వార్తలు
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!







