అజ్మాన్‌లో తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన..వైద్య పరిశోధనలకు కొత్త దిశ

- June 10, 2026 , by Maagulf
అజ్మాన్‌లో తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన..వైద్య పరిశోధనలకు కొత్త దిశ

అజ్మాన్: వైద్య పరిశోధనలు, ఆవిష్కరణలకు మరింత ఊతమిచ్చే లక్ష్యంతో తుంబే గ్రూప్ అజ్మాన్‌లో ప్రతిష్టాత్మక తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. శాస్త్రీయ పరిశోధనలు, నిర్ధారణ సేవలు, క్లినికల్ చికిత్సలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అత్యాధునిక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అజ్మాన్‌లోని డుసిట్ అజ్మాన్ రిసార్ట్ అండ్ విల్లాస్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అజ్మాన్ యువరాజు, అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అమ్మార్ బిన్ హుమైద్ అల్ నుఐమీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి తుంబే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. థంబే మొయిదీన్ ఆతిథ్యం ఇచ్చారు.

ఆరు అంతస్తుల అత్యాధునిక పరిశోధనా కేంద్రం

అల్ జుర్ఫ్ ప్రాంతంలోని ప్లాట్ నంబర్ 7150లో నిర్మించనున్న ఈ కేంద్రం సుమారు 3,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండనుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తులు, రూఫ్‌టాప్ కలిగి మొత్తం 27.75 మీటర్ల ఎత్తుతో నిర్మించబడుతుంది.

ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు కలిసి పనిచేసే విధంగా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి అంతస్తులో ప్రత్యేక పరిశోధనా విభాగాలు

  • మొదటి అంతస్తు: స్టార్ట్‌అప్ ల్యాబ్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్, ఏఆర్/వీఆర్ ల్యాబ్
  • రెండో అంతస్తు: సాధారణ పరిశోధనా ప్రయోగశాలలు
  • మూడో అంతస్తు: క్యాన్సర్ (ఆంకాలజీ) పరిశోధనలు
  • నాలుగో అంతస్తు: జీనోమిక్స్, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, బయోఇన్‌ఫర్మాటిక్స్
  • ఐదో అంతస్తు: ప్రీ-క్లినికల్ రీసెర్చ్, జంతు పరిశోధన విభాగాలు, జీబ్రాఫిష్ రీసెర్చ్ యూనిట్
  • గ్రౌండ్ ఫ్లోర్: 110 సీట్ల సెమినార్ హాల్, ఇమేజింగ్ కోర్ ఫెసిలిటీ

గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధనలకు కేంద్రబిందువు

ఈ కేంద్రం గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ (GMU) పరిశోధనా వ్యవస్థకు శాశ్వత కేంద్రంగా పనిచేయనుంది. మెడిసిన్, డెంటిస్ట్రీ, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్, నర్సింగ్, వెటర్నరీ మెడిసిన్, ఏఐ ఇన్ హెల్త్‌కేర్ విభాగాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు ఇది ఉపయోగపడనుంది.

అలాగే  తుంబే రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్రెసిషన్ మెడిసిన్ (TRIPM) ఈ కేంద్రానికి ప్రధాన ఆధారంగా ఉండనుంది.

వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలకు వేదిక

ఈ కేంద్రం ద్వారా హెల్త్‌టెక్ స్టార్టప్‌లు, ఏఐ పరిశోధకులు, జీనోమిక్స్ నిపుణులు, వైద్య బృందాలు ఒకే వేదిక పై కలిసి పనిచేసే అవకాశం లభించనుంది.దీంతో ప్రెసిషన్ మెడిసిన్, ఇమ్యునోథెరపీ, లిక్విడ్ బయాప్సీ, క్యాన్సర్ మరియు మధుమేహ జన్యు పరిశోధనలకు మరింత వేగం చేకూరనుంది.

తుంబే గ్రూప్ తదుపరి లక్ష్యం

ఈ సందర్భంగా డా.తుంబే మొయిదీన్ మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు, గల్ఫ్‌లో ప్రముఖ ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీ నిర్మాణంపై పెట్టుబడులు పెట్టామని తెలిపారు.

“ఈ పరిశోధనా కేంద్రం మా ప్రయాణంలో తదుపరి అధ్యాయం.ఆవిష్కరణ, నిర్ధారణ, చికిత్సలను ఒకే వేదికపైకి తీసుకురావడమే మా లక్ష్యం” అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ పరిశోధనలకు రూ.6.8 కోట్ల గ్రాంట్

కార్యక్రమంలో భాగంగా థంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ గ్రాంట్ రెండో విడత కింద 30 లక్షల దిర్హమ్‌లు (AED 3 మిలియన్) విలువైన నిధులను 13 పరిశోధనా ప్రాజెక్టులకు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల్లో 26 దేశాలకు చెందిన పరిశోధకులు గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేయనున్నారు.

హార్వర్డ్ మెడికల్ స్కూల్, బేలర్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా (అమెరికా), యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ (కెనడా), ఎరాస్మస్ యూనివర్సిటీ రోటర్‌డామ్ (నెదర్లాండ్స్), జర్మనీ, ఇటలీ, పోలాండ్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గౌరవ డాక్టరేట్లు ప్రదానం

ఈ సందర్భంగా పరిశ్రమ, సేవా కార్యక్రమాలు, సామాజిక అభివృద్ధికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేఈఎఫ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు కే.ఇ.ఫైజల్ మరియు ఎలక్ట్రిక్ వే వ్యవస్థాపకుడు మొహమ్మద్ మీరాన్లకు గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది.

పూర్తయిన అనంతరం ఈ కేంద్రం పీహెచ్‌డీ ఇన్ ప్రెసిషన్ మెడిసిన్, ఫ్యూచర్ సైంటిస్ట్స్ ఆఫ్ యూఏఈ, జీఎంయూ రీసెర్చ్ డే వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు కేంద్రంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com