దుబాయ్ మినీబస్ ప్రమాదం: డ్రైవర్‌కు పరిశుభ్రమైన డ్రైవింగ్ రికార్డు..

- June 11, 2026 , by Maagulf
దుబాయ్ మినీబస్ ప్రమాదం: డ్రైవర్‌కు పరిశుభ్రమైన డ్రైవింగ్ రికార్డు..

దుబాయ్: దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డు పై ఇటీవల జరిగిన ఘోర మినీబస్ ప్రమాదంలో మరణించిన ఏడుగురు కార్మికుల వివరాలను సంబంధిత సంస్థ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గురైన మినీబస్ డ్రైవర్ సంస్థలో అత్యంత సురక్షితంగా వాహనం నడిపే డ్రైవర్లలో ఒకరని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

“ఆయన గత తొమ్మిదేళ్లుగా మా సంస్థలో పనిచేస్తున్నారు.ఆయన డ్రైవింగ్ రికార్డు అత్యంత పరిశుభ్రమైనది. ప్రమాదంలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మరణించిన వారంతా ఆయన స్నేహితులు, రూమ్‌మేట్లు కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఆయనకు మానసిక ఆరోగ్య సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నాం” అని ప్రతినిధి పేర్కొన్నారు.

ట్రక్కును ఢీకొన్న మినీబస్

గత ఆదివారం ఒప్పంద పనులు ముగించుకుని షార్జాలోని తమ నివాసానికి తిరిగి వెళ్తున్న 16 మంది కార్మికులతో కూడిన మినీబస్, రోడ్డుమధ్యలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు.

మృతులను భారత్‌కు చెందిన సలీమ్ సయ్యద్, తిరుపతి గొల్లపల్లి, అబ్దుల్ రఫీక్, అబ్దుల్ రషీద్, మార్కండే చౌహాన్, మహ్మద్ సాకిబ్‌తో పాటు శ్రీలంకకు చెందిన సామువేల్ రెంగసామిగా గుర్తించారు.

మృతదేహాల స్వదేశాలకు తరలింపు

మృతుల భౌతికకాయాలను స్వదేశాలకు పంపించేందుకు అవసరమైన పత్రాల ప్రక్రియను వేగవంతం చేసినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. “రేపటిలోపు అన్ని పత్రాలు పూర్తవుతాయని, అనంతరం మృతదేహాలను వారి స్వదేశాలకు తరలించే అవకాశం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుతం మా వనరులన్నింటినీ బాధితుల కుటుంబాల సహాయానికి కేటాయించాం” అని చెప్పారు.

కుటుంబాలను పోషిస్తున్న వారే బలి

ప్రమాదంలో మృతి చెందిన వారిలో అత్యంత పిన్న వయస్కుడు 23 ఏళ్లవాడైతే, అత్యంత వయోవృద్ధుడు 51 ఏళ్ల వ్యక్తి అని సంస్థ తెలిపింది. “వీరందరూ తమ కుటుంబాలకు ప్రధాన ఆదారంగా ఉన్నారు. ఇప్పుడు వారికి పరిహారం అందవచ్చు కానీ తమ ప్రియమైన వారిని కోల్పోయిన లోటు మాత్రం తీర్చలేము” అని ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.

నిద్రలోనే ప్రమాదానికి గురైన కార్మికులు

ప్రమాదం జరిగిన సమయంలో మినీబస్‌లో ఉన్న చాలామంది కార్మికులు నిద్రలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. వాహనం ఒక వైపు ట్రక్కును బలంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పేర్కొంది.

“ప్రయాణికులు మేల్కొని ఉంటే ప్రమాదాన్ని గమనించి వాహనం మరోవైపుకు కదిలే అవకాశం ఉండేది. ప్రాణాలతో బయటపడ్డవారికీ అసలు ఏమి జరిగిందో పూర్తిగా తెలియడం లేదు” అని ప్రతినిధి తెలిపారు.

నలుగురు ఇంకా ఆస్పత్రిలో చికిత్స

గాయపడిన తొమ్మిది మందిలో ఐదుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని సంస్థ వెల్లడించింది. కొందరికి స్వల్ప గాయాలే కాగా, ఒకరికి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సహాయ ప్యాకేజీ ప్రకటించిన బుర్జీల్ హోల్డింగ్స్

ఈ ఘటన నేపథ్యంలో బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్ డాక్టర్ షంషీర్ వయలిల్ బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి ఆర్థిక మరియు ఇతర సహాయాన్ని అందించే ప్రత్యేక సహాయ ప్యాకేజీని ప్రకటించారు.

తీవ్ర విషాదంలో సంస్థ

“యూఏఈలో మేము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇంతటి విషాదకర ఘటనను ఎన్నడూ ఎదుర్కోలేదు. ఇది ఊహించలేని దుర్ఘటన. ప్రస్తుతం బాధిత కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, వారికి అందాల్సిన పరిహారం మరియు సహాయాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యం” అని సంస్థ ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com