52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?

- June 25, 2026 , by Maagulf
52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?

యూఏఈ: షార్జాకు చెందిన ఒక మహిళ తన ఐదేళ్ల కొడుకు ఒక చిన్న మాగ్నెట్ ను నోట్లో పెట్టుకోవడం చూసినప్పుడు, చాలా మంది తల్లిదండ్రుల్లాగే ఆమె కూడా స్పందించింది. ఆందోళనకు గురైన ఆమె, తాను త్వరగా స్పందించడం వల్ల ప్రమాదం తొలగిపోయిందని భావించి, వెంటనే ఆ వస్తువును లాగేసుకుంది. కానీ ఆమె గ్రహించని విషయం ఏమిటంటే, అప్పటికే 50కి పైగా చిన్న మాగ్నెట్ ను తన కొడుకు మింగేశాడు.

కొన్ని వారాల తర్వాత ఆ బాలుడు కడుపులో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేసేవాడు. వాంతులతో బాధపడేవాడు. కానీ ప్రతిసారీ ఆ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోయేవి. అతని కుటుంబానికి, ఇది కేవలం తాత్కాలిక అనారోగ్యంలా అనిపించింది. కానీ కొన్ని రోజుల్లోనే ఆ బాలుడు నీరసించిపోయాడు. అతని తల్లిదండ్రులు హుటాహుటిన అతడిని షార్జాలోని ఎన్‌ఎంసి రాయల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

ఆసుపత్రిలోని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రమియా దలాటిని బాలుడిని పరీక్షించాడు. ఏదో సరిగ్గా లేదని గుర్తించాడు. ఆసుపత్రిలో చేర్చి, సెలైన్ ఎక్కించడం ప్రారంభించాలని సూచించారు. ఎక్స్-రేలో ఒక అసాధారణ విషయం బయటపడింది.  ఆ బాలుడి పొత్తికడుపులో గొలుసులాంటి వస్తువు ఒకటి ఉంది. ఆ బాలుడి చిన్న ప్రేగులో 52 మాగ్నెట్ పూసలు ఉన్నాయని నిర్ధారించారు.

మొదట డాక్టర్లు ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించడానికి ప్రయత్నించారు.  కానీ ఆ మాగ్నెట్స్ జీర్ణవ్యవస్థలో చాలా లోపలికి వెళ్లిపోయాయి. బాలుడి పరిస్థితి విషమించడంతో, సర్జన్లు అత్యవసర ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. మరుసటి రోజు ఉదయం 2.15 గంటలకు, వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణుల బృందం ఆపరేటింగ్ థియేటర్‌లోకి ప్రవేశించింది.   

ఆ 52 మాగ్నెట్ పూసలు ప్రేగు యొక్క వివిధ వలయాలకు అతుక్కుపోయి, వాటి మధ్య కణజాలాన్ని బంధించి, క్రమంగా గాయాన్ని కలిగించాయని NMC రాయల్ హాస్పిటల్ షార్జాలోని కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ విస్సాం టామర్ తెలిపారు. కేసు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ, సర్జన్లు బాలుడి పేగులోని ఏ భాగాన్ని తొలగించకుండానే, మొత్తం 52 మాగ్నెట్ పూసలను విజయవంతంగా బయటకు తీశారు.  

శస్త్రచికిత్స తర్వాత, ఆ బాలుడు డాక్టర్ దీపికా గాంధీ మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU) బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే, అతను మళ్లీ తినడం ప్రారంభించాడు. మునుపటిలా ఉల్లాసంగా మారాడు. ఈ అనుభవాన్ని జీర్ణించుకోవడం ఇప్పటికీ కష్టంగా ఉందని అతని తల్లిదండ్రులు తెలిపారు.

పిల్లల పరిసరాల్లోని కొన్ని అతి చిన్న వస్తువులు కూడా అతిపెద్ద ప్రమాదాలను సృష్టించగలవని ఈ కేసు గుర్తు చేస్తుందని డాక్టర్లు హెచ్చరించారు. ప్రతి పేరెంట్ తమ పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు.పిల్లలు ఏదైనా విషయాన్ని చెబితే ఓపికగా వినాలని, అసాధారణంగా అనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com