కరీంనగర్‌లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల

- June 27, 2026 , by Maagulf
కరీంనగర్‌లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల

కరీంనగర్: పాఠశాల స్థాయిలో అంతరిక్ష విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తూ కరీంనగర్‌లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల అత్యాధునిక ‘పారమిత స్పేస్ ల్యాబ్’ను శనివారం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లాలో పాఠశాల స్థాయిలో స్పేస్ ఎడ్యుకేషన్‌ను పరిచయం చేసిన తొలి విద్యాసంస్థగా పారమిత హెరిటేజ్ పాఠశాల నిలిచింది.

విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, పరిశోధనల పట్ల ఆసక్తి కలిగించడం, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ స్పేస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. యాక్టివిటీ ఆధారిత, ప్రాక్టికల్ లెర్నింగ్ విధానంలో విద్యార్థులు అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఉపగ్రహ సాంకేతికత, రాకెట్రీ, రోబోటిక్స్, అంతరిక్ష పరిశోధన వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఇ. ప్రసాద్ రావు మాట్లాడుతూ, అంతరిక్ష విద్య అనేది గ్రహాలు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికే పరిమితం కాదని, విద్యార్థుల్లో పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకునే ఆలోచన, శాస్త్రీయ దృక్పథం, సమస్యలను విశ్లేషించే నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఖగోళ శాస్త్రం, ఆస్ట్రోఫిజిక్స్ వంటి అత్యాధునిక రంగాల్లో కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ల్యాబ్ దోహదపడుతుందని తెలిపారు.

పాఠశాల ప్రిన్సిపాల్ పి. గోపీకృష్ణ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ స్పేస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమానికి సహకరించిన చైర్మన్ ఇ. ప్రసాద్ రావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యలో నాణ్యత, ఆవిష్కరణలకు తమ సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.

పారమిత స్పేస్ ల్యాబ్ ప్రారంభంతో విద్యార్థుల్లో జిజ్ఞాస, సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం మరింత పెంపొందుతుందని, భవిష్యత్తులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, అంతరిక్ష పరిశోధకులుగా ఎదగడానికి ఈ ల్యాబ్ బలమైన పునాది వేస్తుందని పాఠశాల యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్ రావు, వినోద్ రావు, వి.యు.యం. ప్రసాద్, హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com