అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!

- June 29, 2026 , by Maagulf
అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!

అయోధ్యలో భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన నిధులను కొందరు కేటుగాళ్లు కాజేశారు. అయోధ్య రామ మందిర విరాళాల స్కామ్ వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ కేసులో ప్రధాన నిందితులు విరాళాల డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా, బంగారం, వెండి, బినామీ ఆస్తులను కూడబెట్టారు. ఈ అక్రమాలకు పాల్పడిన నిందితుల వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

అనుకల్ప్ మిశ్రా: కుంభకోణానికి సూత్రధారి

రామ మందిర నిధుల లెక్కింపు బాధ్యతను చూసే అనుకల్ప్ మిశ్రా, ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అరెస్టయిన మొదటి వ్యక్తి ఇతడే. కౌశల్‌పురిలోని ఇతని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి సుమారు 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సుభాష్ శ్రీవాస్తవ: బ్యాంకు ఉద్యోగి అక్రమాలు

కెనరా బ్యాంక్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన సుభాష్ శ్రీవాస్తవ, రామ మందిర ట్రస్ట్‌లో చేరారు. బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉండటంతో, భక్తుల విరాళాలను లెక్కించే కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అయితే, నమ్మక ద్రోహం చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు.

అనుకల్ప్ మిశ్రా సన్నిహితుడు

రామ మందిర హుండీలను లెక్కించే పనిలో ఉన్న కరుణేష్ పాండే, సూత్రధారి అనుకల్ప్ మిశ్రాకు అత్యంత సన్నిహితుడు. తన అక్రమ మార్గాలను సులభతరం చేసేందుకు అనుకల్ప్ మిశ్రా తనకు కావాల్సిన వారిని కీలక స్థానాల్లో నియమించుకున్నాడని దర్యాప్తులో తేలింది.

రామశంకర్ మిశ్రా: నిధుల సేకరణలో మోసం

విరాళాలను లెక్కించి వివరాలను నమోదు చేసే సిబ్బందిలో రామశంకర్ మిశ్రా ఒకడు. దేవుడి సొమ్మునే దొంగిలించిన ఈయన ఇంట్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

లవ్‌కుష్ మిశ్రా: బంధువులతో కలిసి దోపిడీ

ప్రధాన నిందితుడు అనుకల్ప్ మిశ్రా బావమరిది లవ్‌కుష్ మిశ్రా. ఇతని తండ్రి రవీంద్ర మిశ్రా ద్వారా ఆలయ ప్రాంగణంలో పనిలో చేరాడు. విరాళాల దొంగతనం బయటపడటంతో, ఇతని ఇంట్లో పోలీసులు దాదాపు 10 లక్షల రూపాయలను పట్టుకున్నారు.

మనీష్ యాదవ్: విలాసాలకు అలవాటుపడిన కేటుగాడు

టిన్ను యాదవ్ అనే వ్యక్తి మేనల్లుడు ఈ మనీష్ యాదవ్. విరాళాల నిర్వహణలో వీరు చేసిన అవినీతి వల్ల ఖరీదైన గృహోపకరణాలు, లగ్జరీ మొబైల్ ఫోన్లు, బంగారం, వెండి ఆభరణాలను వీరు కొనుగోలు చేశారు. ఇతని పూర్వీకుల ఆస్తులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు.

అవినాష్ శుక్లా: బ్యాంక్ ఖాతాల్లో అక్రమ సొమ్ము

అయోధ్య స్థానిక నివాసి అవినాష్ శుక్లా, విరాళాల లెక్కింపు బృందంలో సభ్యుడు. ఇతని బ్యాంక్ ఖాతాల్లో దాదాపు 5 లక్షల రూపాయల అక్రమ సొమ్ము ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నిందితులందరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com