స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు
- July 02, 2026
హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై నిఘా ఉంచిన నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) అధికారులు ఒక భారీ అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. భారత ప్రభుత్వ అధికారిక విభాగానికి చెందిన ‘స్పీడ్ పోస్ట్’ సేవలను ఆసరాగా చేసుకుని, నిందితులు దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠాకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఝార్ఖండ్‌కు చెందిన ముఠా నాయకుడితో పాటు, నగరంలో డ్రగ్స్ ఆర్డర్ చేసిన మరో ఇద్దరు స్థానికులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
‘ఔషధాల’ పేరుతో డ్రగ్స్ పార్సిళ్లు: రూ. 5 కోట్ల టర్నోవర్
పోలీసుల వివరాల ప్రకారం..ఝార్ఖండ్‌కు చెందిన సత్యం మిశ్రా అనే వ్యక్తి ఈ అక్రమ నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. స్థానికంగా లభ్యమయ్యే గంజాయిని సేకరించి, వాటిని పార్సిళ్లలో ప్యాక్ చేసి, లోపల “ఔషధాలు (Medicines)” ఉన్నాయంటూ తప్పుడు పత్రాలు సృష్టించేవాడు. అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలోని దాదాపు 21 రాష్ట్రాలకు వీటిని చేరవేసేవాడు.
సోషల్ మీడియా, వాట్సాప్ వేదికగా ఆర్డర్లు సేకరిస్తూ.. యూపీఐ (UPI) ద్వారా డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ దందా ద్వారా సత్యం మిశ్రా రోజుకు రూ. 1 లక్ష, నెలకు రూ. 30 నుండి 35 లక్షల వరకు ఆర్జించేవాడు. ఈ ముఠా వార్షిక టర్నోవర్ సుమారు రూ. 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో పట్టుబడ్డ లింకులు
ఝార్ఖండ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కొన్ని అనుమానాస్పద పార్శిళ్లను తనిఖీ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. నగరంలో ఈ పార్శిళ్లను అందుకున్న సుశాంత్ వ్యాస్, లడ్డూ అనే ఇద్దరు వ్యక్తులను హెచ్-న్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నగరంలోని గుడిమల్కాపూర్, ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులో సత్యం మిశ్రా సోదరుడు శుభం మిశ్రాతో పాటు మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు.
పోస్టల్ వ్యవస్థలో స్కానింగ్ తప్పనిసరి చేయాలి: సీపీ సజ్జనార్
ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. ప్రభుత్వ రవాణా వ్యవస్థలైన పోస్టల్ సర్వీసుల్లో ఉన్న భద్రతా లోపాలను ఈ ఘటన ఎత్తిచూపుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పేర్కొన్నారు. స్పీడ్ పోస్ట్ పార్శిళ్లకు కూడా కచ్చితమైన స్కానింగ్ ప్రక్రియను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలోని 22 మంది సభ్యుల బృందం చాకచక్యంగా వ్యవహరించి ఈ అంతరాష్ట్ర ముఠాను పట్టుకుందని సీపీ అభినందించారు.
తాజా వార్తలు
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్
- దుబాయ్‌లో ‘బ్రిడ్జెస్ ఆఫ్ లవ్’ పుస్తక ఆవిష్కరణ.. మత సామరస్యానికి పిలుపు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక







