ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- July 02, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ చరిత్రలోనే మరో అద్భుతమైన చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన ఉపాధి పథకం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్’ (VB-G RAM G) ఆంధ్రప్రదేశ్ నుంచే అధికారికంగా ప్రారంభమై, దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో జరిగిన ఒక భారీ బహిరంగ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కలిసి ఈ బృహత్తర పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలోని ముక్కవారిపల్లి గ్రామంలో సుమారు రూ. 4.55 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన మూడు వినూత్న పనులకు ముగ్గురు నేతలు ఒకే వేదికపై శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం.. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం కార్యక్రమాలను ‘వీబీ జీ రామ్ జీ మిషన్’ కింద దేశంలోనే తొలి పనులుగా ప్రారంభించడం విశేషం.
జాబ్ కార్డుల పంపిణీ.. అఫీషియల్ పోర్టల్ లాంచ్
పథకం ప్రారంభోత్సవం అనంతరం గ్రామానికి చెందిన స్థానిక లబ్ధిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా కొత్త జాబ్ కార్డులను అందజేసి అభినందనలు తెలిపారు. ఇదే వేదికపై కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ కలిసి ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మిషన్‌కు సంబంధించిన అధికారిక సమాచార బుక్‌లెట్‌ను మరియు ఇతర ప్రచురణలను విడుదల చేయగా, నేతలంతా కలిసి కంప్యూటర్ బటన్ నొక్కి పథకం యొక్క ‘అధికారిక వెబ్ పోర్టల్’ ను ప్రపంచానికి పరిచయం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు శాశ్వత ఆస్తుల సృష్టి ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకం ముందుకు సాగనుంది. ఏపీ వేదికగా ఈ పథకానికి అంకురార్పణ జరగడం పట్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామీణ లబ్ధిదారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్‌లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







