పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష

- July 02, 2026 , by Maagulf
పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష

హైదరాబాద్: హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మరియు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన పెండింగ్ అంశాల పై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం డీజీపీ సి.వి.ఆనంద్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పోలీస్ స్టేషన్ జూరిస్డిక్షన్‌లను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ, న్యాయస్థానాల పరిధులను సమన్వయం చేస్తూ కొత్త పోలీస్ స్టేషన్ సరిహద్దులను రూపొందించాలని సూచించారు.

అలాగే ఈ ప్రక్రియలో నగర దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్ పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు సంబంధిత వర్గాల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధుల ఖరారుకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి తుదిరూపు దిద్దాలని అధికారులకు సూచించారు.

ఈ పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖ కార్యనిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన పరిపాలన అందించడమే లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com