ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- July 04, 2026
అబుదాబి, జూలై 4: యూఏఈలో తొలి ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించిన ఎతిహాద్ రైల్ సంస్థ టికెట్ ధరలు, రద్దు, మార్పులకు సంబంధించిన నిబంధనలను వెల్లడించింది. సేవలు ప్రారంభానికి ముందే 10 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ప్రారంభ ఆఫర్‌లో భాగంగా పెద్దల టికెట్లపై 50 శాతం తగ్గింపు అందిస్తున్నారు. దీంతో కంఫర్ట్ క్లాస్ టికెట్లు AED 55 నుంచి, ప్రీమియం క్లాస్ టికెట్లు AED 120 నుంచి లభిస్తున్నాయి.
టికెట్ ధరల్లో చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. 17 ఏళ్లలోపు పిల్లలకు సాధారణ టికెట్ ధరపై 50 శాతం తగ్గింపు ఉంటుంది. 14 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా పెద్దలతో కలిసి ప్రయాణించాలి. రెండేళ్లలోపు శిశువులు పెద్దల ఒడిలో కూర్చుంటే ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే వారికి ప్రత్యేక సీటు కావాలంటే చిన్నారి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అలాగే 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు టికెట్ ధరపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నారు. అవసరమైతే వయస్సు నిర్ధారణకు సంబంధించిన గుర్తింపు పత్రాలు చూపించాలని అధికారులు సూచించారు.
టికెట్ రద్దు–రీఫండ్ నిబంధనలు
ప్రయాణికులు టికెట్‌ను ఎతిహాద్ రైల్ మొబైల్ యాప్, అధికారిక వెబ్‌సైట్‌లోని 'మై బుకింగ్స్' విభాగం, కాల్ సెంటర్ లేదా స్టేషన్లలోని టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా రద్దు చేసుకోవచ్చు.
టికెట్ రకాన్ని బట్టి రీఫండ్ నిబంధనలు ఇలా ఉన్నాయి:
- సేవర్ (Saver): రీఫండ్ లేదు.
- వాల్యూ (Value): రీఫండ్ లేదు.
- ఫ్లెక్స్ (Flex): ప్రయాణానికి 24 గంటల కంటే ముందే రద్దు చేస్తే పూర్తి రీఫండ్ లభిస్తుంది. 24 గంటలలోపు రద్దు చేస్తే 30 శాతం రద్దు ఛార్జీ మినహాయించి మిగిలిన మొత్తం తిరిగి చెల్లిస్తారు. ప్రయాణానికి హాజరుకాకపోతే ఎలాంటి రీఫండ్ ఉండదు.
టికెట్ మార్పులకు అవకాశం
ప్రయాణికులు యాప్, వెబ్‌సైట్, టికెట్ వెండింగ్ మెషీన్లు లేదా కాల్ సెంటర్ ద్వారా టికెట్ తేదీ, సమయాన్ని మార్చుకోవచ్చు. అయితే ప్రయాణ మార్గం, ప్రారంభ లేదా గమ్య స్టేషన్‌ను మార్చుకునే అవకాశం ఏ టికెట్ రకానికీ ఉండదు.
సేవర్: మార్పులకు అనుమతి లేదు.
వాల్యూ: ప్రయాణానికి 72 గంటల ముందు వరకు తేదీ, సమయాన్ని ఉచితంగా మార్చుకోవచ్చు. అనంతర మార్పులకు AED 20తో పాటు వర్తించే చార్జీల వ్యత్యాసం చెల్లించాలి.
ఫ్లెక్స్: నిర్ణీత ప్రయాణ సమయానికి ముందు, అలాగే రైలు బయలుదేరిన తర్వాత 30 నిమిషాల వరకు తేదీ, సమయాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అవసరమైతే చార్జీల వ్యత్యాసం చెల్లించాలి.
టికెట్‌లో మార్పులు చేసిన తర్వాత కొత్త టికెట్ జారీ అవుతుందని, పాత టికెట్ చెల్లుబాటు కాదని ఎతిహాద్ రైల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







