ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!

- July 07, 2026 , by Maagulf
ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!

దోహా: ప్రజల్లో అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఖతార్ ప్రభుత్వం చక్కెర కలిపిన పానీయాలపై కొత్త ఎక్సైజ్ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 6నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని జనరల్ ట్యాక్స్ అథారిటీ (GTA) ప్రకటించింది. డ్రింక్స్ లో ఉన్న చక్కెర లేదా అదనంగా కలిపిన స్వీటెనర్ల పరిమాణాన్ని బట్టి ఎక్సైజ్ పన్ను నిర్ణయిస్తారు. ఈ మేరకు ఎక్సైజ్ పన్ను చట్టంలో సవరణలు చేసి పన్ను పరిధిని విస్తరించారు. దీంతో అదనపు చక్కెర కలిగిన కూల్ డ్రింక్స్, జ్యూసులు, అలాగే వాటి తయారీలో ఉపయోగించే కాన్సన్‌ట్రేట్లు, పొడులు, ఎక్స్‌ట్రాక్టులు తదితర ఉత్పత్తులు కూడా ట్యాక్స్ పరిధిలోకి వచ్చాయి.

అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ వస్తువులను నిల్వ ఉంచిన వ్యాపారులు, సంస్థలు తమ వద్ద ఉన్న నిల్వలను ధరీబా (Dhareeba) పోర్టల్ ద్వారా  ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పన్ను నిర్ణయించడంలో స్టాక్ పరిమాణమే ప్రమాణం కాదని GTA స్పష్టం చేసింది. డ్రింక్స్ లో ఉన్న చక్కెర లేదా అదనపు స్వీటెనర్ల స్థాయినే పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది. పన్ను చెల్లింపుదారులు జూలై 6నుంచి 90 రోజుల్లోపు ధరీబా పోర్టల్ ద్వారా పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. రిటర్న్ సమర్పించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పన్ను చెల్లించాలని అథారిటీ సూచించింది.

అలాగే సీల్ చేసిన ప్యాకేజింగ్‌లో విక్రయించే పానీయాలకు మాత్రమే ఈ ఎక్సైజ్ పన్ను వర్తిస్తుంది. రెస్టారెంట్లు, కేఫేలు వంటి చోట్ల వెంటనే వినియోగం కోసం తయారు చేసి, ప్యాకేజింగ్ లేకుండా అందించే పానీయాలకు ఈ పన్ను వర్తించదని జనరల్ ట్యాక్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com