ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!

- July 07, 2026 , by Maagulf
ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!

మనామా: ప్రాంతీయ భద్రతా అంశాల్లో భారత్ అందించిన మద్దతుకు బహ్రెయిన్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ సోమవారం మనామాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ తో సమావేశమయ్యారు.  ఈ సమావేశంలో  భారత్-బహ్రెయిన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను అల్ జయానీ కొనియాడారు. పరస్పర గౌరవం, సహకారంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించేందుకు జాయింట్ మినిస్టీరియల్ కమిటీని మరింత యాక్టివ్ గా నిర్వహించడంతో పాటు ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇరాన్ దూకుడు చర్యలను భారత్ ఖండించడమే కాకుండా బహ్రెయిన్‌కు సంఘీభావం ప్రకటించినందుకు అల్ జయానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాలు, జోర్డాన్ తరఫున బహ్రెయిన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం 2817కు భారత్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన అభినందించారు. బహ్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం దేశ అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తోందని అల్ జయానీ పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో భారతీయులు అతిపెద్ద ప్రవాస సమాజాల్లో ఒకరని, వివిధ ఆర్థిక, వృత్తిపర రంగాల్లో వారి సేవలు విశేషమని కొనియాడారు.
ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడుతూ .. బహ్రెయిన్ పర్యటన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారత్-బహ్రెయిన్ సంబంధాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా నిర్మాణాత్మక సహకారానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో రాజకీయ, ఆర్థిక, పెట్టుబడులు, అభివృద్ధి తదితర రంగాల్లో సహకార అవకాశాలపై ఇరు దేశాల మంత్రులు విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలను సమర్థంగా అమలు చేసి పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే జాయింట్ మినిస్టీరియల్ కమిటీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసి, పరస్పర ప్రయోజనాలు గల రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com