ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- July 07, 2026
ఖమ్మం: తెలంగాణ పోలీసు శాఖలో సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్‌కు "బ్యాక్ టు బేసిక్స్" విధానమే మూలమని రాష్ట్ర డీజీపీ సి.వి.ఆనంద్ పేర్కొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన జిల్లా క్రైమ్ రివ్యూ సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లా నేరాల పరిస్థితిని సమీక్షించి, లోపాలను గుర్తించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఆర్థిక మోసాలు 30 శాతం, ఉద్యోగ మోసాలు 36 శాతం పెరిగాయని, నకిలీ పత్రాల కేసులు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. జీఎస్టీ నేరాల దర్యాప్తు కూడా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది సైబర్ నేరాల వల్ల 711 మంది బాధితులు రూ.9.48 కోట్లను కోల్పోగా, ఇప్పటివరకు రూ.1.41 కోట్లను తిరిగి రికవరీ చేసినట్లు వెల్లడించారు.
మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోనే 1,700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, రాష్ట్రంలో అత్యధిక గంజాయి పట్టివేతలు జరిగిన జిల్లాల్లో ఖమ్మం ఒకటిగా నిలిచిందన్నారు.
డీజీపీ ఈ సందర్భంగా రోడ్డు భద్రతా పార్క్‌ను ప్రారంభించడంతో పాటు జిల్లా కమాండ్ సెంటర్‌కు అనుసంధానించిన 250 కొత్త సీసీటీవీ కెమెరాలు, కమిషనరేట్ సీసీటీవీ కమాండ్ ఫెసిలిటీని ప్రారంభించారు. తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా సీసీటీవీలు ఏర్పాటు చేసిన పౌరులను అభినందించారు. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి హెల్మెట్లు పంపిణీ చేశారు. గత ఏడాది 317తో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 146కు తగ్గడం సంతోషకరమని పేర్కొన్నారు. వనమహోత్సవం సందర్భంగా మొక్కలు కూడా నాటారు.
పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేసిన డీజీపీ..మాదకద్రవ్యాలపై యుద్ధ ప్రాతిపదికన పోరాటం కొనసాగించాలని, భవిష్యత్ తరాలను కాపాడాలని సూచించారు. చట్టానికి అనుగుణంగా పనిచేస్తూ పేదలు, బలహీన వర్గాలకు ముందుగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయడంతో పాటు సీసీటీఎన్‌ఎస్ డేటా నమోదులో కచ్చితత్వం పాటించాలని చెప్పారు.
భూ, పౌర వివాదాల్లో ఎలాంటి జోక్యం ఉండకూడదని, ప్రామాణిక విధానాలను (ఎస్‌ఓపీ) కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ 3.0, హాక్ ఐ 3.0, టీజీ కాప్స్ 3.0 వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించాలని పేర్కొన్నారు. ఈగిల్ తరహాలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బ్యూరోను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
చివరగా పోలీసు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, "ఈ యూనిఫాం ధరించడం ఒక గొప్ప అవకాశం. రాష్ట్రంలోని 4.5 కోట్ల జనాభాలో కేవలం 0.16 శాతం మందికే ఈ అవకాశం లభిస్తుంది. కాబట్టి నిజాయితీతో విధులు నిర్వహించండి. నిజాయితీ లేకపోతే ఈ యూనిఫాం ధరించకండి" అంటూ డీజీపీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







