'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- July 10, 2026
రియాద్: సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు తమ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేదా లైసెన్సులు జారీ చేయలేదని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోలో చూపిస్తున్న ఆసుపత్రి ఏర్పాటు లేదా నిర్వహణకు ఎలాంటి చట్టబద్ధ హోదా లేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీడియోలో కనిపించిన వ్యక్తి ఓ వైద్యుడని, గతంలో ఆరోగ్య శాఖకు చెందిన ఆసుపత్రిలో డైరెక్టర్‌గా పనిచేశారని తెలిపింది. ప్రస్తుతం అతడిని అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యల కోసం నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచినట్లు పేర్కొంది.
అలాగే ఈ ప్రాజెక్టులో 50 ఆసియా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయన్న ప్రచారాన్ని కూడా ఆరోగ్య శాఖ పూర్తిగా ఖండించింది. సౌదీ ఆరోగ్య వ్యవస్థ, ప్రత్యామ్నాయ వైద్య సేవల నియంత్రణకు సంబంధించి వీడియోలో చేసిన ఇతర వ్యాఖ్యలు కూడా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. సౌదీలో ఏదైనా ఆరోగ్య ప్రాజెక్టును ప్రకటించాలన్నా, వైద్య సేవలను అందించాలన్నా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అన్ని లైసెన్సులు, నియంత్రణ అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని, అనధికారిక ప్రకటనలు, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది.
ప్రజారోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య రంగ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







