సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- July 14, 2026
హైదరాబాద్: మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ, సురక్షిత సమాజ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. "మీ సురక్ష – సహచరి" కార్యక్రమంలో భాగంగా నాగోల్‌లోని శుభమ్ కన్వెన్షన్‌లో ఎల్.బి. నగర్, ఉప్పల్ జోన్లకు చెందిన స్వయం సహాయక సంఘాల (SHG) మహిళల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన, మహిళలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలు, పోలీస్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకునే విధానాలపై సమగ్రంగా వివరించారు.
మహిళలు ఎదుర్కొనే సైబర్ మోసాలు, ఆన్లైన్ ఆర్థిక నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో, అనుమానాస్పద సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. అలాగే మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలు, అత్యవసర సహాయ వ్యవస్థలు, ఫిర్యాదు నమోదు ప్రక్రియపై కూడా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ బి.సుమతి మాట్లాడుతూ, మహిళల భద్రతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ ధైర్యంగా, సురక్షితంగా జీవించే వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులతో పంచుకోవాలని, ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్ సేవలను వినియోగించాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భద్రత, చట్టపరమైన హక్కులు, సైబర్ నేరాల నివారణకు సంబంధించిన పలు సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. మహిళల్లో అవగాహన పెంపొందించి, భద్రతా చైతన్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్‌లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్‌కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







